KCR పాలనలో నల్లగొండకు తీరని అన్యాయం: ఉత్తమ్, కోమటిరెడ్డి ధ్వజం

  • By: sr    news    Apr 28, 2025 5:50 PM IST
KCR పాలనలో నల్లగొండకు తీరని అన్యాయం: ఉత్తమ్, కోమటిరెడ్డి ధ్వజం

విధాత: కేసీఆర్ పదేళ్ల పాలనలో ఇరిగేషన్ రంగంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నల్గొండ కలెక్టరేట్‌లో అదనపు బ్లాక్‌ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ డిండి, ఏదుల ప్రాజెక్టులను కేసీఆర్‌ పదేళ్లపాటు పట్టించుకోలేదన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను పదేళ్లపాటు కేసీఆర్‌ పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం మళ్లీ పని ప్రారంభించిన కొన్ని రోజులకే దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగిందన్నారు. ఇప్పటికైనా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేసి తీరుతామని. గత ప్రభుత్వం మూసీ కాలువలను అసంపూర్తిగా వదిలేసిందన్నారు. దేవరకొండ, మిర్యాలగూడ లిఫ్టు పథకాలను కూడా పూర్తి చేయలేదన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు నల్గొండ జిల్లా నాయకులం ముక్తకంఠంతో మద్దతు తెలుపుతున్నామని స్పష్టం చేశారు.

సాగునీటి ప్రాజెక్టుల ముసుగులో కేసీఆర్ దోపిడీ

సాగునీటి రంగంలో రూ.1.81 లక్షల ఖర్చు చేసిన కేసీఆక్ కుటుంబం జేబులు నింపుకొన్నారని ఉత్తమ్ విమర్శించారు. బీఆర్ఎస్ నేతల కమీషన్ల కక్కుర్తి వల్లే, రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసిన కాళేశ్వరం నాణ్యత లోపించి మూడేళ్లలోనే కూలిపోయిందని విమర్శించారు. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టి.. అప్పులు చేసి కాళేశ్వరం పేరిట రూ. లక్ష కోట్లు ఖర్చు చేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి మా ఏడాదిన్నర పాలనపై నిందలు వేస్తున్నారన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలు పనికిరావని ఎన్‌డీఎస్‌ఏ చెప్పిందని గుర్తు చేశారు.

అక్రమ దోచుకున్న సొమ్ముతో సభ పెట్టుకుని కాంగ్రెస్ పాలనను విమర్శించిన కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విధ్వంసం చేశారన్నారు. కాళేశ్వరం కూలిన తర్వాతా కూడా 280లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి జరిగిందన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని ఒప్పుకొని రాష్ట్రానికి కేసీఆర్‌ తీవ్ర అన్యాయం చేశారని..కానీ, తెలంగాణకే 500 టీఎంసీలు కేటాయించాలని మా ప్రభుత్వం పోరాడుతోంది’’ అని ఉత్తమ్‌ తెలిపారు. ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో ప్రజలు సహకరించాలని..రైతులను ఒప్పించిన తర్వాతే ప్రాజెక్టులకు భూసేకరణ చేస్తామన్నారు.

పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

డిండి ఎత్తిపోతల పథకాన్ని సంస్థాన్‌నారాయణపురం, చౌటుప్పల్‌ వరకు పొడిగిస్తామని తెలిపారు. పూడిక వల్ల ఎస్‌ఆర్‌ఎస్పీ ప్రాజెక్టు నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని.. ఎస్‌ఆర్‌ఎస్పీ ఫేజ్‌-2 పనులను పూర్తి చేస్తే.. ఉమ్మడి నల్గొండ జిల్లాకు నీటి సమస్య తీరుతుందన్నారు. 67టీఎంసీల నీళ్లు సీతారామ ప్రాజెక్టుకు అందుబాటులో ఉన్నందునా వాటిలో నల్లగొండ జిల్లాకు వస్తాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను, ఎత్తిపోతల పథకాలను పూర్తి చేస్తామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీ చేసి..క్వింటాల్ కు రూ.500బోనస్ సన్న ధాన్యానికి అందిస్తుందన్నారు. పేదలకు రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం అందిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డుల ఇవ్వలేదని..కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందిస్తుందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల కృషితోనే జిల్లాలో అత్యధిక సీట్లు గెలిచి మరోసారి కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిందన్నారు. మీకు మేం సేవకులుగా పనిచేస్తామన్నారు.

ఆనాడు సోనియా ఆశీస్సులు తీసుకోలేదా?: కోమటిరెడ్డి

బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అని మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్న సంగతి మరిచిపోవడం దారుణమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గతంలో ‘తెలంగాణ ఇచ్చిన దేవత సోనియాగాంధీ అని కేసీఆర్‌ అనలేదా?’ అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆయనే.. తెలంగాణ విలన్‌ కాంగ్రెస్ పార్టీ అని దారుణంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఇచ్చినప్పుడు కుటుంబ సమేతంగా వెళ్లి సోనియాగాంధీ ఆశీస్సులు తీసుకోలేదా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారని అసెంబ్లీలో కేసీఆర్‌ అనలేదా? ఇచ్చిన ప్రతి హామీని ఈ ప్రభుత్వం క్రమక్రమంగా నెరవేరుస్తోందన్నారు.

కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి రూ.10వేల కోట్లు దోచుకుతిన్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి వేల ఎకరాలు ఆక్రమించుకున్నా రన్నారు. మంత్రులు, అధికారుల ఫోన్లు ట్యాపింగ్‌ చేయించి.. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్‌.. ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా ఇవ్వలేదు’’ అని విమర్శించారు. అన్నింటి ఫెయిలైన కేసీఆర్ ను ప్రజలు ఫామ్ హౌస్ కు పంపించారన్న అక్కసుతో కాంగ్రెస్ ఫెయిల్ అంటూ విమర్శలు చేస్తున్నాడని కోమటిరెడ్డి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.