దేశంలోనే మొట్టమొదటి భారీ ప్రైవేట్ బంగారు గని ఆంధ్రప్రదేశ్ జొన్నగిరి గోల్డ్ మైన్స్ నుంచి వెలికితీసిన బంగారం బులియన్ మార్కెట్ లో విక్రయాలకు కూడా అందుబాటులోకి వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశం మొత్తం జొన్నగిరిలో గోల్డ్‌మైన్స్ వైపు చూస్తున్న క్రమంలో కుప్పంలోని బంగారం గనులు కొత్తగా చర్చనీయాంశంగా మారాయి. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ‘చిగరుగుంట–-బిసనత్తమ్’ మధ్య బంగారు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 18 లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు అంచనా, అక్కడ బంగారును తవ్వుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసింది. 2018లో మైనింగ్‌కు ఎన్ఎండీసీ బిడ్ దక్కించుకుంది. కానీ రైతుల అభ్యంతరంతో పూర్తి స్థాయి లైసెన్స్ పొందలేకపోయింది. 2026 ప్రారంభంలోనూ టెండర్లు పిలిచినా ఖరారు చేయకుండానే రద్దు చేశారు. ఇప్పుడు మూడో సారి టెండర్లు పిలవగా.. జూలై 9 వరకు బిడ్లు దాఖలుకు అవకాశం ఇచ్చారు. దాదాపు 25ఏళ్లుగా మూతపడిన ‘చిగరుగుంట–-బిసనత్తమ్’ గనులను తిరిగి ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. గతంలో 263 హెక్టార్లలో విస్తరించిన గనుల పరిధిని తాజా సర్వేలో మరో తొమ్మిది హెక్టార్లు పెంచారు. పర్యావరణ అనుమతులు పూర్తైతే రెండేళ్లలో ఇక్కడ మైనింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
1978నుంచే చిగురుగుంట బంగారం గనులలో తవ్వకాలు
చిగురుగుంట బంగారం గనులకు దశాబ్దాల చరిత్ర ఉంది. భౌగోళికంగా ఈ ప్రాంతం కర్ణాటకలోని కోలార్‌కు చేరువగా ఉంటుంది. చిగురుగుంట, బిసానత్తం ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలను గుర్తించిన తరువాత బిసానత్తం గనిని 1968లో, చిగురుగుంట గనిని 1978లో ప్రారంభించారు. తొలుత ఎంఈసీఎల్ సంస్థ ఆధ్వర్యంలో తవ్వకాలు చేపట్టి బంగారం ముడి ఖనిజాన్ని కేజీఎఫ్ లోని భారత్ గోల్డ్ మైనింగ్ లిమిటెడ్ (బీజీఎంఎల్) కు సరఫరా చేసింది. తర్వాత ఆర్థిక ఇబ్బందుల కారణంగా గనుల నిర్వహణ బాధ్యతలను బీజీఎంఎల్‌కు అప్పగించారు. 1982 నుంచి 2001 జనవరి 15 వరకు బీజీఎంఎల్ తవ్వకాలు కొనసాగించింది. అయితే కేజీఎఫ్ గనులు నష్టాల్లో పడటంతో చిగురుగుంట, బిసానత్తం గనులనూ మూసివేశారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ మూసివేసినప్పటి నుంచి దేశంలో బంగారం ఉత్పత్తి అనేది దాదాపు ఆగిపోయింది. దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
రీ ఓపెనింగ్ కు బిడ్డింగ్ లు…
ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం జొన్నగిరి గోల్డ్ మైన్స్ ను ప్రారంభించిన నేపథ్యంలో చిగురుగుంట ప్రాంతంలోని బంగారం గనిని రీ ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గుడుపల్లె మండలంలోని ఈ బంగారు గనిని రీఓపెన్ చేయడం ద్వారా స్థానికంగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 2011లో కాంగ్రెస్ ప్రభుత్వం 263హెక్టార్లలో 150 బోర్లు వేసి బంగారం లభ్యతపై అధ్యయనం చేయగా.. గనుల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం 2022లో వైసీపీ ప్రభుత్వం హయాంలో రూ.450 కోట్లతో ఎన్ఎండీసీకి ప్రాజెక్టు బాధ్యతలు అప్పగించినప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. 2001లో మూతపడిన చిగురుగుంట గనులను మళ్లీ ప్రారంభించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక ముందడుగు వేసి బిడ్డింగ్ ప్రక్రియను చేపట్టింది. చిగురుగుంట–బిసానత్తం ప్రాంతంలో సుమారు 18 లక్షల టన్నుల బంగారం నిల్వలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. ఒక టన్ను ముడి ఖనిజం నుంచి సగటున 5.5 గ్రాముల బంగారం లభించే అవకాశముండగా.. మొత్తం 8.5 టన్నుల బంగారం వెలికితీయవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. చిగురుగుంట-బిసానత్తం బంగారు గనులు 272.987 హెక్టార్లలో విస్తరించాయి. చిగురుగుంటలో 20.43 లక్షల టన్నుల ఖనిజ నిల్వలు ఉండగా.. టన్ను ముడిఖనిజాన్ని శుద్ధి చేస్తే 5.73 గ్రాముల బంగారం, బిసానత్తంలో 1.73 లక్షల టన్నుల ఖనిజం ఉంటుందని అంచనా. ఇక్కడ టన్నుకు 4.70 గ్రాముల బంగారం వస్తుందని భావిస్తున్నారు.
చిగురుకుంటలో బంగారం వెలికితీత వ్యయం ఎక్కువే..
జొన్నగిరి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్ మైనింగ్ కావడం వల్ల తవ్వకానికి తక్కువ మొత్తం ఖర్చవుతుంది. కానీ కుప్పం ఏరియాలో గతంలో నేల ఉపరితలం మీద ఉన్న బంగారం ముడి ఖనిజాన్ని తవ్వేశారు. ఇప్పుడు భూగర్భంలో తవ్వకాలు జరపాల్సి ఉంటుంది. ఇందుకు అయ్యే ఖర్చు ఎక్కువ. గనుల్లో లోతుకు వెళ్లే కొద్దీ ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. జొన్నగిరిలో భూమి ఉపరితలం నుంచి 100-–150 మీటర్ల లోతులో బంగారం లభిస్తుండటంతో.. ఇక్కడ ఉత్పత్తి వ్యయం తక్కువ. దీంతో ఇక్కడ బంగారం ఉత్పత్తి ఆర్థికంగా లాభదాయకం కానుంది. కుప్పం ప్రాంతంలో నాణ్యమైన బంగారం లభించడానికి కనీసం 300 మీటర్ల నుంచి 1000 మీటర్ల లోతు వరకు సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. దీంతో ఇక్కడ ఉత్పత్తి వ్యయం ఎక్కువ కానుంది. చిగురుగుంటలో 20 లక్షల టన్నులకు పైగా బంగారం ఖనిజ నిల్వలు ఉండగా.. బిసానత్తంలో 1.7 లక్షల టన్నులకుపైగా ఖనిజం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలోని ముడి ఖనిజం సాధారణ రకం కాదు. ఇక్కడ ఉన్న బంగారం.. క్వార్ట్‌జ్‌తోపాటు పైరెట్, సల్ఫైడ్ లాంటి ఇతర ఖనిజాలతో గట్టిగా ముడిపడి ఉంటుంది. దీంతో ఈ ఖనిజాల నుంచి బంగారాన్ని వేరు చేయడానికి అత్యాధునిక టెక్నాలజీతోపాటు సంక్లిష్టమైన రసాయన క్రియలు అవసరం. అంతే కాకుండా బంగారం శుద్ధికి భారీ స్థాయిలో నీరు అవసరం అవుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
