Nara Lokesh : వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటి పునరుద్దరణకు మంత్రి లోకేశ్ ఆదేశాలు

తుపాన్ వర్షాలతో దెబ్బతిన్న వీరబ్రహ్మేంద్రస్వామి పురాతన ఇంటి పునరుద్ధరణకు మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు.

Nara Lokesh : వీరబ్రహ్మేంద్ర స్వామి ఇంటి పునరుద్దరణకు మంత్రి లోకేశ్ ఆదేశాలు

అమరావతి : మొంథా తుపాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కూలిన కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లయ్యపల్లె గ్రామంలో కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాసమైన పురాతన ఇంటిని పునరుద్దరించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. తుపాన్ వర్షాల ధాటికి 16వ శతాబ్దానికి చెందిన వీరబ్రహ్మేంద్రస్వామి పురాతన ఇల్లు పాక్షికంగా నేలమట్టమైంది. ఇంటి గోడతో పాటు శ్లాబు కుప్పకూలింది. ఇంట్లోని స్తంభం కుంగిపోయింది. ఈ ఘటనపై బ్రహ్మంగారి భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

స్పందించిన మంత్రి నారా లోకేశ్ మన సాంస్కృతిక వారసత్వంలోని ఈ విలువైన ఇంటిని కాపాడటానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను ‘ఎక్స్‌’లో కోరారు. దీంతో కలెక్టర్‌ శ్రీధర్‌ను బ్రహ్మంగారి ఇంటిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూలిన ఇంటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అదే మెటీరియల్‌తో ప్రత్యేక ఆర్కిటెక్చర్‌, ధార్మిక పరిషత్‌ సలహాలు, సూచనలతో పునర్నిర్మిస్తామని తెలిపారు.