మాతృత్వపు వింత….కుక్క పిల్లలకు పాలు ఇచ్చిన పంది !

కర్నూలు జిల్లా జంపాపురంలో తల్లి లేని ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు ఓ పంది పాలు ఇచ్చిన అరుదైన ఘటన వైరల్‌గా మారింది. జాతి వైరాన్ని మరిచిన ఈ మాతృత్వం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో పేర్కొన్నట్లుగా అప్పుడప్పుడు కలియుగంలో వింతలు విశేషాలు వెలుగుచూడటం ఆసక్తి రేపుతుంటుంది. తాజాగా ఓ భారీ వరాహం(పంది) ప్రకృతి సహజ విరుద్దంగా కుక్క పిల్లలకు పాలు ఇవ్వడం వైరల్ గా మారింది. కర్నూల్ జిల్లా మంత్రాలయం వద్ద .కోసిగి మండలం జంపాపురంలో ఈ వింత ఘటన చోటుచేసుకుంది.

ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలు తన తల్లీ లేక పోవడంతో పంది పాలు తాగడానికి దాని వద్దకు వెళ్లాయి. వాటిని చూసి పంది సహజ వైరంతో దూరంగా తరముతుందని అంతా భావించారు. అందుకు విరుద్దంగా ఆ పంది తనలోని మాతృత్వాన్ని గుర్తు చేసుకుందేమోగాని.. ఆకలిలో ఉన్న ఆ కుక్క పిల్లలకు చక్కగా పాలు ఇస్తూ సహకరించింది. ఈ వింతను చూసి గ్రామస్తులు అందరు ఆశ్చర్యపోయారు.

జాతి వైరాన్ని మరిచి మాతృత్వ మమకారం ముందు జాతి వైరాన్ని మరిచి కుక్క.. మేక పిల్లలకు, పిల్లి పిల్లలకు, పంది కుక్క పిల్లలకు పాలు ఇవ్వడం వంటి ఘటనలు గతంలోనూ వెలుగుచూశాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలకు ఓ పంది తన పాలివ్వడం, ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో అలాగే ఓ శునకం పంది పిల్లలకు పాలిచ్చి మానవత్వాన్ని మించిన ప్రేమను ప్రదర్శించడం విశేషం.

Latest News