పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి సుప్రీంలో చుక్కెదురు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో వైసీపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్‌లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్ధించింది

పోస్టల్ బ్యాలెట్ కేసులో వైసీపీకి సుప్రీంలో చుక్కెదురు ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ

విధాత : పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో వైసీపీకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. పోస్టల్ బ్యాలెట్‌లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్‌పై గెజిటెడ్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని, సీలు, హోదా అవసరం లేదని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్ధించింది. పోస్టల్ బ్యాలెట్లపై జూన్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను వైసీపీ సుప్రీం కోర్టులో సవాలు చేసింది. ఈ పిటీషన్‌పై సోమవారం విచారణ జరిపిన జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం వైసీపీ పిటిషన్‌ను తిరస్కరిస్తూ తీర్పు ఇచ్చింది.

అంతకుముందు పోస్టల్ బ్యాలెట్‌ల విషయంలో వైసీపీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. పోస్టల్‌ బ్యాలెట్‌ డిక్లరేషన్‌కు సంబంధించి ఫారమ్‌-13ఏపై అటెస్టింగ్‌ అధికారి సంతకం ఉండి, హోదా వివరాలు లేకపోయినా బ్యాలెట్‌ చెల్లుబాటవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం మే 30న ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలన్న వైసీపీ అభ్యర్థనను న్యాయస్థానం నిరాకరించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వుల్లో మేం జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. అవసరమైతే ఎన్నికల కౌంటింగ్ తరువాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని సూచించింది. కమిషన్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేది లేదని స్పష్టం చేసింది. దీంతో వైసీపీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇదే అంశంపై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీచేసే ముందు కోర్టు తన వాదనలు కూడా వినాలని కోరుతూ ఆయన ఈ పిటిషన్ ఫైల్ చేశారు.