అరవింద్‌కు ప్రాధాన్యం లేనిశాఖ!
తెలంగాణ రాష్ట్ర బిఆరెఎస్ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగి, మూడోసారి ప్రభుత్వం వస్తే ప్రధాన కార్యదర్శి అవుతానని కలలు కన్న అరవింద్ కుమార్ కు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది

- వాకాటి కరుణ కూడా
- విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం
విధాత, హైదరాబాద్: బీఆరెస్ ప్రభుత్వం హయాంలో ఒక వెలుగు వెలిగి, మూడోసారి ప్రభుత్వం వస్తే ప్రధాన కార్యదర్శి అవుతానని కలలు కన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చినట్టు కనిపిస్తున్నది. మున్సిపల్ వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా వ్యవహరిస్తూ బీఆరెస్ పెద్దలు చెప్పినట్లుగా విధులు నిర్వర్తించారనే విమర్శలు ఉన్నాయి.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ కాంట్రాక్టును ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయంలో ప్రతిపక్షాల నుంచి ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అప్పటి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు కూడా పంపించారు. తనకు బీఆరెస్ ప్రభుత్వం గొప్ప తప్ప ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఏ మాత్రం గొప్ప కాదు అనే విధంగా వ్యవహరించారని సచివాలయ వర్గాలు చెబుతుంటాయి. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు నోటి నుంచి ఆదేశం వచ్చిన వెంటనే పని పూర్తి చేయించేవారనే అపవాదు కూడా ఉన్నది. నామినేషన్ పై కాంట్రాక్టులు అప్పగించి కోట్లాది రూపాయలు గుంజారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తను చెప్పిందే ప్రభుత్వం, ప్రభుత్వం కన్నా తను సుపీరియర్ అనే విధంగా రాజ్యమేలారని కూడా సచివాలయంలో చర్చలు జరిగాయి.
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏఎస్‌ల ప్రక్షాళన ప్రారంభించింది. ఈ క్రమంలోనే గత బీఆరెస్ ప్రభుత్వానికి వంతపాడుతూ, ఇష్టానుసారంగా పనిచేసిన ఐఎస్‌లకు ప్రాధాన్యం లేని శాఖలకు మార్చుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌ను ఈ క్రమంలోనే ప్రాధాన్యం లేని రెవెన్యూ శాఖలోని విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేసిందని చెబుతున్నారు. విపత్తుల నిర్వహణ విభాగానికి బదిలీ చేశారంటే అంతకన్నా అవమానం లేదనేది అధికారవర్గాలు చెబుతున్న మాట. విపత్తుల నిర్వహణ విభాగం అధిపతి పోస్టు జిల్లా కలెక్టర్ స్థాయి కన్నా తక్కువ, డిప్యూటీ కలెక్టర్ స్థాయికి ఎక్కువ అనే కామెంట్లు వినిపిస్తుంటాయి. అరవింద్ స్థానంలో మెట్రో వాటర్ సప్లయి బోర్డు ఎండీగా పనిచేసిన దానకిశోర్‌ను నియమించారు.
వాకాటి కరుణపైనా వేటు
కళాశాల విద్య కమిషనర్, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణకు సైతం ముఖ్యమంత్రి గట్టిషాక్ ఇచ్చారనే అభిప్రాయాలు సచివాలయంలో వినిపిస్తున్నాయి. బీఆరెస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈమెను మహిళా, శిశు సంక్షేమ శాఖకు కార్యదర్శిగా నియమించడం ద్వారా అప్రాధాన్య పోస్టు అప్పగించారని చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత వరంగల్ జిల్లా కలెక్టర్‌గా, సీసీఎల్‌ఏ, ఆ తరువాత కళాశాల విద్యలో కీలకమైన బాధ్యతలను ఆమె నిర్వర్తించారు. ఆమె స్థానంలో బీసీ సంక్షేమ కమిషనర్ గా వ్యవహరిస్తున్న బుర్రా వెంకటేశంను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించిన ఆయనను తెలంగాణ రాష్ట్రంలో బీఆరెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రాధాన్యం లేని శాఖలలో నియమించారని విమర్శలు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా పనిచేసిన తరువాత బదిలీ వేటుపై వచ్చిన టీకే శ్రీదేవిని సైతం ఎలాంటి ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించారు. ఆమె ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తుండగా, తాజా బదిలీల్లో వాణిజ్య పన్నుల కమిషనర్‌గా పంపారు. ఆదివారం నాటి బదిలీలను పరిగణనలోకి తీసుకుంటే మున్ముందు గతంలో బీఆరెస్ ప్రభుత్వ పెద్దలతో అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.