స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదం బాధకరం అని..ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదని, లిక్విడ్‌ మెటల్‌ బ్లాస్ట్‌ అవ్వడంతోనే జరిగిందని, కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ విమర్శించారు. బుధవారం సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్లాంట్ లో ప్రమాదం జరిగి పెంటయ్య అనే కార్మికుడు మరణిస్తే..చంద్రబాబు ప్రభుత్వం నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారని, ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదని జగన్ విమర్శించారు. అధికారుల్ని అడిగితే ఫైల్‌ పోయిందని అంటున్నారని, కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

అయ్యా లోకేష్.. నువ్వు ఇచ్చేదేంద‌య్యా బోడీ

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో 9 మంది చనిపోగా, గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని జగన్ తెలిపారు. కేంద్రం ఇచ్చిన రూ.2లక్షల పరిహారం మినహా చంద్రబాబు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఎక్స్ ట్రా రాలేదని, పరిహారం విష‌యంలో చంద్ర‌బాబు కొడుకు మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడాడని విమర్శించారు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని లోకేశ్ చెప్పాడని, నిజానికి స్టీల్ ప్లాంట్ ప్ర‌మాద బాధితుల‌కు కేంద్రం నుంచి అదంతా హ‌క్కుగా రావాల్సిందే వ‌స్తుందన్నారు. అందులో ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్‌ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్‌ ఇన్సూరెన్స్‌.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు అని జగన్ విమర్శించారు. గతంలో.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్‌లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం అని, మరికొన్ని నెలలు ఆగితే మళ్లీ మన ప్రభుత్వం వస్తుందని, వచ్చిన నెల రోజుల్లోనే రూ.1 కోటి పరిహారం ఇచ్చి ఆదుకుంటాం అని జగన్ ప్రకటించారు.

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల పరిస్థితి దారుణం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను వైఎస్సార్‌సీపీ అడ్డుకుంటుందని…గతంలో ఇందుకోసం వైసీపీ చేసిన కృషిని వివరించారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దని మోదీకి రెండు లేఖలు రాశాం. ప్రైవేటీకరణ వద్దని అసెంబ్లీలో కూడా తీర్మానం చేశాం.ప్రైవేటీకరణను ఆపి కార్మికులకు అండగా నిలిచాం అని జగన్ తెలిపారు. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను తొలగించారు. వీఆర్‌ఎస్‌ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారని జగన్ ఆరోపించారు. కార్మికుల నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్‌కు లింకు పెట్టారు. వైఎస్సార్‌సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్‌లో యూనిట్‌ విద్యుత్‌కు 50 పైసలే చార్జ్‌ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్‌కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్‌ను వదిలిపోయేలా చేశారు. బోనస్‌, మెడికల్‌ ఫెసిలిటీస్‌ ఏం లేవు. రూ.11440 కోట్ల ప్యాకేజీ ఇచ్చామని మంత్రులు చెబుతున్నారు.అది మెయింటెనెన్స్‌ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.