YS Jagan allegations | చంద్రబాబు పాలనలో మద్యం మాఫియాలు విజృంభిస్తున్నాయ్ : వైఎస్ జగన్
ఏపీలో కల్తీ మద్యం దందా వ్యవస్థీకృతమైందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీదని, టీడీపీ నేతలే దానికి కారణమని విమర్శించారు.

–ప్రతీ మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ
–కల్తీ మద్యంలో రాష్ట్రం నెంబర్ వన్
– ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం సిండికేట్ల జేబుల్లోకి!
–వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
YS Jagan alleges one in every three liquor bottles in Andhra is spurious; blames Chandrababu-led TDP for liquor mafia
అమరావతి, అక్టోబర్ 5 (విధాత):
ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మద్యం అక్రమ వ్యాపారం వ్యవస్థీకృతంగా నడుస్తోందని, ప్రతి మూడు బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యం బాటిలేనని సంచలన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో టీడీపీ నాయకులే ఈ కల్తీ మద్యం తయారీ, సరఫరా దందాకు మూలకారణమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
చంద్రబాబే మద్యానికి బ్రాండ్ అంబాసిడర్
జగన్ మాట్లాడుతూ — “చంద్రబాబు గారూ, మీరు మద్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారడమే కాకుండా ఇప్పుడు కల్తీ లిక్కర్ వ్యవహారంలోనూ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా చేయాలని కంకణం కట్టుకున్నట్టున్నారు” అని విమర్శించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో టీడీపీ నేతలే కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీ నడపడం రాష్ట్రంలో మద్యం అక్రమాల తీవ్రతకు ఉదాహరణ అని పేర్కొన్నారు. “రాష్ట్రానికి సంపద పెరగడం సంగతేమో కానీ, మద్యం సిండికేట్లతో, నకిలీ తయారీలతో, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీ పార్టీ నాయకులు దోచుకుంటున్నారండి బాబు గారూ” అంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. “మీ సిండికేట్లకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వ మద్యం దుకాణాలపై విషప్రచారం చేశారండి. వాటిని తీసేసి మీ బినామీలకు అప్పగించారు. రాష్ట్రంలో బెల్టుషాపులు, ఇల్లీగల్ పర్మిట్ రూములు అన్నీ టీడీపీ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. వాళ్లే తయారు చేస్తారు, అమ్ముతారు, ఆ డబ్బును పంచుకుంటారు. ఈ వ్యవస్థ మొత్తం మీ పర్యవేక్షణలోనే నడుస్తోంది” అన్నారు.
మద్యం విక్రయాలు కొండంత – ఆదాయం గోరంత
రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగినా, ఎక్సైజ్ ఆదాయం మాత్రం పెరగలేదని జగన్ వివరించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఐదు నెలల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ₹6,782 కోట్లు ఆదాయం వచ్చింది. కానీ, 2025-26లో విచ్చలవిడిగా మద్యం అమ్మినా సరే ₹6,992 కోట్లు మాత్రమే వచ్చింది — అంటే కేవలం 3.10% వృద్ధి. అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం టిడిపి సిండికేట్లు కొట్టేస్తున్నాయని ఆరోపించారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలు, రాయలసీమ — రాష్ట్రమంతా కల్తీ మద్యం గురించి వాస్తవాలు వెల్లడవుతున్నా విచారణ మాత్రం జరగడం లేదు. ఎందుకంటే ఈ దందా వెనుక ఉన్నవాళ్లంతా టీడీపీ బినామీలు. వారిని రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం తూతూమంత్రంగానే వ్యవహరిస్తోంది” అని అంటూ, ములకలచెరువు ఘటనలో కూడా టీడీపీ ఇన్‌ఛార్జ్ ఆధ్వర్యంలో మద్యం తయారైందని, అసలు నిందితులను కాపాడేలా కేసు మార్చారని విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఈ దందా, ఈ నేరాలు సాగుతున్నాయి. ప్రజల ప్రాణాలతో ఆడుకోవడం న్యాయమా అని జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.