YS Jagan : కృష్ణా జలాలపై ఏపీ హక్కుల బాధ్యత టీడీపీదే
కృష్ణా జలాలపై ఏపీ హక్కులను కాపాడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ. టీడీపీ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని, రైతుల ప్రయోజనాలు కాపాడాలని డిమాండ్.
అమరావతి: కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను కాపాడాలని ఏపీ ప్రభుత్వానికి వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ సూచించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు జగన్ తొమ్మిది పేజీల లేఖ రాశారు. రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 512 టీఎంసీ నికర జలాల్లో ఒక్క టీఎంసీ కోల్పోయే పరిస్థితి తలెత్తినా, దానికి టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రాబోయే కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్-2 విచారణ ముందు తన వాదనను వినిపించే అవకాశం ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. ఆ లేఖలో వైఎస్ జగన్ ఏమన్నారంటే?.. ‘ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా వాదనలు వినిపించాలి. ట్రిబ్యునల్ ఎదుట జరగబోయే వాదనల్లో రాష్ట్ర ప్రయోజనాలను సమర్థవంతంగా వినిపించాలి. పొరపాటు జరిగితే ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీలను కేటాయించేందుకు ట్రిబ్యునల్ అంగీకరిస్తే ఏపీకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం తమ వాదనలు వినిపించాలని జగన్ డిమాండ్ చేశారు.
రాయలసీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహిస్తుంది
రాయలసీమ ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జగన్ తన లేఖలో ఆరోపించారు. 1996లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అల్మట్టి ప్రాజెక్టు ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆల్మట్టి ఎత్తు పెంపునకు అనుమతి ఇచ్చిందన్నారు. అంతేకాదు.. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఏపీ హక్కులను తెలంగాణకు పూర్తిగా వదిలేసిందని విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంపు వలన ఏపీ హక్కులకు ముప్పు ఏర్పడుతుంది. దీనిపై అప్పట్లో ఎన్ని ఆందోళనలు చేసినా చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ప్రజాభిప్రాయాన్ని రైతుల ఆందోళనలను ఖాతరు చేయలేదని ఆరోపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram