YS Sharmila | మీకెందుకు మద్దతునివ్వాలి.. వైఎస్ జగన్‌కు షర్మిల కౌంటర్

ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయంటూ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయని, ఆ పార్టీ మద్ధతనివ్వకపోవడంపై కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌. షర్మిల ఘాటుగా కౌంటర్ వేశారు

YS Sharmila | మీకెందుకు మద్దతునివ్వాలి.. వైఎస్ జగన్‌కు షర్మిల కౌంటర్

విధాత, హైదరాబాద్ : ఏపీలో శాంతి భద్రతలు దిగజారిపోతున్నాయంటూ ఢిల్లీలో వైసీపీ చేపట్టిన ధర్నాకు ఇండియా కూటమిలో కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు మద్దతు పలికాయని, ఆ పార్టీ మద్ధతనివ్వకపోవడంపై కాంగ్రెస్ నాయకులే సమాధానం చెప్పాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌. షర్మిల ఘాటుగా కౌంటర్ వేశారు. మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలని ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా? ఎందుకు మీ ధర్నాకు కాంగ్రెస్‌ పార్టీ సంఘీభావం తెలపాలని జగన్‌ను షర్మిల ప్రశ్నించారు. ఐదేళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని విభజన హక్కులను, ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు.

ఆఖరికి మణిపూర్‌ ఘటనపై కూడా నోరెత్తని మీకు ఉన్నట్టుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. క్రైస్తవుడవు అయ్యి ఉండి.. క్రైస్తవులను ఊచకోతకు గురిచేసినా నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ వ్యతిరేకించిన మతతత్వ బీజేపీకే జై కొట్టారు కదా? అని వ్యాఖ్యానించారు. మణిపూర్‌ ఘటనపై కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీ నుంచి సంఘీభావం వచ్చిందా? అని జగన్‌ను షర్మిల ప్రశ్నించారు. మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప.. రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసి కాంగ్రెస్‌ పార్టీ దూరంగా ఉందని స్పష్టం చేశారు. సిద్ధం అన్న వాళ్లకు 11 మంది బలం సరిపోలేదా? ఇప్పుడు కలిసి పోరాడుదామని అంటున్నారని మండిపడ్డారు