తాడేపల్లి వైసీపీ కార్యాలయం కూల్చివేత.. విశాఖ కార్యాలయానికి నోటీస్‌లు
తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం రెండు అంతస్తుల భవనాన్ని అధికారులు సరైన అనుమతులు లేవంటూ శనివారం తెల్లవారుజామున పూర్తిగా నేలమట్టం చేశారు.

విధాత: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం రెండు అంతస్తుల భవనాన్ని అధికారులు సరైన అనుమతులు లేవంటూ శనివారం తెల్లవారుజామున పూర్తిగా నేలమట్టం చేశారు. బుల్డోజర్లు, జేసీబీలతో కూల్చివేత పనులు నిర్వహించారు. ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా మాజీ సీఎం జగన్ స్పందించారు. ఏపీలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన సీఎం చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని సీరియస్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన @YSRCParty కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 22, 2024
రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయన్నారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్ల పాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇస్తున్నారన్నారు. ఈ బెదిరింపులకు, ఈ కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదన్నారు. వెన్నుచూపేది అంతకన్నా లేదని తేల్చిచెప్పారు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని జగన్ రిక్వెస్ట్ చేశారు.
విశాఖలోనూ వైసీపీ కార్యాలయానికి నోటీసులు
విశాఖ ఎండాడలోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ జీవీఎంసీ నోటీస్‌లు జారీ చేసింది. జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడంపై జీవీఎంసీ వివరణ కోరింది. వారం లోపు సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైసీపీ కార్యాలయానికి జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పేరిట నోటీస్‌లు అంటించారు.