HYDRAA | హైదరాబాద్ నిషేధిత ప్రాంతాల్లో స్థలాలు కొనడం, నిర్మాణాలు చేయొద్దు : హైడ్రా
హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRAA Commissioner Ranganath), భాగ్య నగరంలో బఫర్ జోన్స్(Buffer Zones)లో స్థలాలు కొనొద్దని, నిర్మాణాలు చేపట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అలా చేసిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు.

హైదరాబాద్ పరిధి రోజురోజుకీ విస్తరిస్తోంది. బతుకుదెరువు కోసం వేలాదిమంది పొరుగు జిల్లాల నుండి, రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి జీవనోపాధి వెతుక్కుంటున్నారు. దీంతో నగర జనాభా విపరీతంగా పెరిగింది. దానికి తగ్గట్టుగా వ్యాపారాలు, నిర్మాణాలు, కట్టడాలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ కట్టడాలు, కబ్జాలు ప్రారంభమయ్యాయి. చెరువులు, కుంటలు, ప్రభుత్వభూములు అన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. కబ్జాలే కాకుండా, అక్కడ అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడంతో నగరంలో దిక్కుతోచని స్థితి ఏర్పడింది.
వానాకాలంలో చెరువులు, కుంటలు(Encroachment of Lakes and Ponds) కబ్జా చేసి అక్రమంగా కట్టిన ఇళ్లు, కాలనీలలోకి సహజంగానే వరదనీరు చేరడంతో ఏం చేయలో తెలియని ఆ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. ఎన్నో వేల ఎకరాల చెరువు శిఖం భూములు, కుంటల భూములు హైదరాబాద్‌లో ఆక్రమణకు గురై, నిర్మాణాలు కూడా జరిగిపోయాయి(Thousands of Acres encroached). వర్షాలకు కృశించిపోయిన చెరువులు నిండి, వాటి పూర్తి ప్రాంతాలకు నీళ్లు విస్తరిస్తాయి. అక్కడ నిర్మాణాలు ఉండటంతో వాటిలోకి ప్రవేశించి ప్రజలను ఇక్కట్లపాలు చేస్తున్నాయి. ఈ పాపాలకు కారణం స్థానిక కబ్జాదారులు, వారికి సహకరించే రాజకీయ నాయకులే కారణం.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటువంటి అరాచకాలకు అడ్డుకట్ట వేసి, అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపేందుకు, చెరువులు, కుంటల పూర్తిస్థాయి నీటి మట్టాన్ని(FTL) పరిరక్షించేందుకు, తద్వారా అనుకోని ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని ఏర్పాటు చేసింది. అదే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా-HYDRAA). ఈ హైడ్రాకు విస్తృతాధికారాలు కల్పిస్తూ ముఖ్యమంత్రి(Chief Minister Revanth Reddy) ఆదేశాలు జారీ చేసారు. ఈ ఏజెన్సీలో మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక శాఖలను భాగస్వాములుగా చేసి, తగిన సిబ్బందిని, ఇతర సౌలభ్యాలను వెంటనే కల్పించి రంగంలోకి దించారు. దీనిని కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి రంగనాథ్(Ranganath IPS)ను నియమించారు. రంగనాథ్‌కు ముక్కుసూటి అధికారిగా చాలా పేరుంది.
ఈ మధ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRAA Commissioner Ranganath), భాగ్య నగరంలో బఫర్ జోన్స్(Buffer Zones)లో స్థలాలు కొనొద్దని, నిర్మాణాలు చేపట్టొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు. అలా చేసిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొదట అక్రమ కట్టడాలను(Illegal Constructions) అడ్డుకుంటామని, తరువాత అక్రమంగా నిర్మాణాలు చేపట్టినవారిపై చర్యలు, ఆ నిర్మాణాల కూల్చివేత ఉంటుందని తెలిపారు. మరో కార్యక్రమంగా చెరువుల్లో పూడిక తీసి వాన నీరు దారిమళ్లకుండా చెరువులకు పునరుజ్జీవం కల్పిస్తామన్నారు. చెరువుల పూర్తి పరిధి(Full Tank Level – FTL)లోని ఆక్రమణలను గుర్తించే పనిలో హైడ్రా ఉందనీ, దీనికి తాము అత్యున్నత సాంకేతిక విధానాలను అవలంబిస్తున్నట్లు రంగనాథ్ పేర్కొన్నారు.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(NRSC) నివేదిక ప్రకారం, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత 44 ఏళ్లలో చాలా చెరువులు కనుమరుగయ్యాయని, అది కూడా కబ్జాల రూపంలో కావడం విచారకరమని అన్నారు. ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, దాదాపు 60 నుండి 80 శాతం వరకు చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని(60 to 80 percent Lakes encroached) చెప్పిన ఆయన, వీటిని తక్షణం ఆపకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. గొలుసు కట్టు చెరువులన్నీ పునరుద్దరిస్తామని చెప్పారు. చెరువుల్లో నీటిని నింపే నాలాలన్నీ పూడుకు పోయాయన్నారు. నాలాలు(Nalas) కూడా దారుణంగా కబ్జాలు చేసారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. దారి లేని వాననీరు ఇళ్లలోకే చేరుతుందన్న విషయం పౌరులు గుర్తించాలని, సామాజిక బాధ్యతతో మెలగాలని సూచించారు. చెరువుల పరీక్షణకు ప్రజలందరితో కలిసి మేధోమధనం చేస్తామని పేర్కొన్నారు. ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన రంగనాథ్, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయొద్దని తెలిపారు. ఇకనుండి కబ్జాలను, అక్రమ నిర్మాణాలను తీవ్రనేరాలుగా పరిగణించి, క్రిమినల్ చర్యలు(Criminal Cases) కూడా చేపడతామని, హైడ్రాకు ప్రత్యేక పోలీస్ స్టేషన్(Special Police Station for HYDRAA) కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు.
ప్రతీ పౌరుడికీ సామాజిక బాధ్యత ఉండాలని సూచించిన హైడ్రా కమిషనర్, ప్రజల భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏ లక్ష్యాన్నీ పూర్తిగా సాధించలేదని స్పష్టం చేసారు.