రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 80 కోట్ల విడుదల
తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు అమలవుతుండగా, తాజాగా మరో గ్యారెంటీని అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో గ్యారెంటీని అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించింది.
మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్ పథకానికి రూ. 80 కోట్ల విడుదలకు అనుమతిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు గ్యారెంటీల్లో అమలులో భాగంగా రూ. 500కే సిలిండర్ పథకాన్ని ఈ నెల 27వ తేదీన ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పథకానికి నిధుల విడుదలకు అనుమతిస్తూ పౌరసరఫరాల శాఖ పాలనాపరమైన ఉత్తర్వులిచ్చింది. కాగా సబ్సిడీ పథకం అమలు కోసం ఈ రూ.80 కోట్లు గ్యాస్ ఏజెన్సీ ఖాతాలో పడనున్నాయి.
అయితే, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకానికి 40 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు అర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పింది.. అయితే సబ్సిడీ వంట గ్యాస్ స్కీంకు రేషన్‌కార్డు కు లింకు పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఆహార భద్రత (రేషన్) కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ వంట గ్యాస్ సిలిండర్లు పొందేందుకు అర్హులు. అయితే, వంటగ్యాస్ కనెక్షన్‌దారుల్లో సగానికి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు లేవు. ముఖ్యంగా గత పదేళ్లలో అనేక కుటుంబాల్లోని సభ్యులు వివాహాలతో వేరుపడడం, కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయకపోవడంతో కార్డులు లేని కుటుంబాల సంఖ్య బాగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అది సబ్సిడీ గ్యాస్ అర్హతకు సమస్యగా మారిందంటున్నారు. అంతేకాకుండా.. ప్రధాన మంత్రి ఉజ్వల కల్యాణ్ యోజన పథకం లబ్దిదారులకు ఈ పథకం వర్తిస్తుందా లేదా.. అన్నది కూడా తెలియాల్సి ఉంది.