Alampur | అలంపూర్‌లో అనూహ్యంగా మారిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి.. ఎవ‌రీ విజ‌యుడు..?

Alampur | అలంపూర్‌లో అనూహ్యంగా మారిన బీఆర్ఎస్ అభ్య‌ర్థి.. ఎవ‌రీ విజ‌యుడు..?

Alampur | మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గానూ 14 స్థానాల‌కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త‌మ అభ్య‌ర్థుల‌ను ఒకేసారి ప్ర‌క‌టించారు. 13 మందికి మాత్ర‌మే బీ ఫామ్స్ కూడా అంద‌జేశారు కేసీఆర్. కానీ అలంపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్ర‌హంకు మాత్రం బీ ఫామ్ ఇవ్వ‌లేదు. ఆయ‌న‌పై తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని పార్టీ స‌ర్వేల్లో తేలిన‌ట్లు స‌మాచారం. కానీ చివ‌రి వ‌ర‌కు త‌న‌కే బీ ఫామ్ ఇస్తార‌ని అబ్ర‌హాం ఆశ‌లు పెట్టుకున్నారు. నామినేష‌న్ల చివ‌రి తేదీ స‌మీపిస్తుండ‌టంతో.. అనూహ్యంగా అబ్ర‌హాంను కాద‌ని కోడెదూడ విజ‌య్‌కు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ అంద‌జేసింది. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డి రాజ‌కీయం వ‌ల్లే అబ్ర‌హాంకు టికెట్ ద‌క్క‌లేద‌ని, అత‌నిపై త‌ప్పుడు ప్ర‌చారం చేసి త‌న అనుచ‌రుడు విజ‌య్‌కు టికెట్ ఇప్పించుకున్నార‌ని అలంపూర్‌లో కొంత‌మంది గుస‌గుస‌లడుకుంటున్న‌ట్టు స‌మాచారం. ఏదేమైనప్ప‌టికీ.. కాంగ్రెస్ అభ్య‌ర్థి సంప‌త్‌ను ఢీకొట్టి విజ‌య్ విజ‌యుడిగా నిలుస్తారో.. లేదో వేచిచూద్దాం.

అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థిగా కోడెదూడ విజ‌య్‌ను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎంపిక చేశారు. ఈ మేర‌కు బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ‌య్‌కు మంగ‌ళ‌వారం బీ ఫాం అంద‌జేశారు. నెల రోజుల నుంచి అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ఉత్కంఠ‌కు మంగ‌ళ‌వారం రాత్రి తెర‌ప‌డింది. ఉండ‌వ‌ల్లి మండ‌లం పుల్లూరు గ్రామానికి చెందిన విజ‌య్ 20 ఏండ్లుగా ఎమ్మెల్సీ చ‌ల్లా వెంక‌ట్రామిరెడ్డికి న‌మ్మ‌క‌స్తుడిగా కొన‌సాగుతున్నారు. ద‌ళిత సామాజిక వ‌ర్గంలో నిజాయితీ గ‌ల వ్య‌క్తిగా, నియోజ‌క‌వ‌ర్గానికి సుప‌రిచితుడిగా ఉన్నారు. వారం రోజులుగా ప్ర‌చారంలో పాల్గొంటూ కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి సీఎం చేయాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు.

విజ‌య్ కుటుంబ నేప‌థ్యం..

విజ‌య్ త‌ల్లిదండ్రులు స‌వార‌న్న‌, స‌వార‌మ్మ‌. ఏడుగురి సంతానంలో విజ‌య్ ఆరో సంతానం. విజ‌య్ ఉపాధి హామీ ప‌థ‌కంలో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ప‌ని చేశారు. ఒక‌టి నుంచి ఏడో త‌ర‌గ‌తి వ‌ర‌కు పుల్లూరు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో, 8వ త‌ర‌గ‌తి అలంపూర్‌లో, 9, 10 త‌ర‌గ‌తులు హాస్ట‌ల్‌లో ఉండి చ‌దివారు. ఇంట‌ర్, డిగ్రీ క‌ర్నూల్ ప‌ట్ట‌ణంలో పూర్తి చేశారు. 1977, జూన్ 10న జ‌న్మించారు. విజ‌య్‌కు ఇద్ద‌రు మ‌గ‌పిల్ల‌లు, భార్య అనీల ఉన్నారు.