అలాగైతే బీజేపీకి 400 సీట్లు ఖాయమంటున్న కాంగ్రెస్ నేత శ్యాం పిట్రోడా
రాబోయే లోక్‌సభ ఎన్నికలలోపు ఈవీఎంలను సరిచేయకపోతే బీజేపీకి 400 సీట్లు ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాంపిట్రోడా హెచ్చరించారు.

- ఈవీఎంల కచ్చితత్వంపై శ్యాం పిట్రోడా అనుమానాలు
- వాటిని సరిచేయకుంటే బీజేపీకి 400 సీట్లు ఖాయం
న్యూఢిల్లీ: దేశంలో అన్ని ఎన్నికలకూ ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల కచ్చితత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా అనుమానాలు వ్యక్తం చేశారు. వాటిని సరిచేయకుంటే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుచుకుంటుందని గురువారం ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెచ్చరించారు. దేశంలో టెలికం విప్లవానికి సూత్రధారిగా కాంగ్రెస్ అభివర్ణించే పిట్రోడా సాంకేతిక నిపుణుడు కూడా. వీవీ ప్యాట్ సిస్టమ్ ప్రస్తుత డిజైన్‌ను మార్చాలని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకుర్ సారథ్యంలోని స్వచ్ఛంద సంస్థ సిఫారసు చేసిన విషయాన్ని పిట్రోడా ప్రస్తావించారు. ‘ఈ విషయంలో ఎన్నికల సంఘం స్పందిస్తుందని ఎదురుచూసినా అది జరుగకపోవడంతో నేను ఈ విషయంలో మాట్లాడాలని నిర్ణయించుకున్నా’ అని ఆయన చెప్పారు. ఈవీఎంలపై విశ్వాసం సన్నగిల్లిందని, దీనిని ఎన్నికల సంఘం పునరుద్ధరించాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లలో విజయం సాధిస్తుందా? అన్న ప్రశ్నకు.. ఈవీఎంలను సరిచేయకపోతే అది సాధ్యమేనని బదిలిచ్చారు. ఎన్నికల సంఘం తలుచుకుంటే ఆ పనిచేయగలదని అన్నారు. ‘ఎన్నికలకు ముందే ఈవీఎంలను సరిచేయకపోతే 400 సీట్లు నిజమే అవుతుంది. సరిచేస్తే నిజం కాకపోవచ్చు’ అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. ఈవీఎంలలో బీజేపీకి అనుకూలంగా రిగ్గింగ్ జరుగుతున్నదని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేస్తున్నది. కాంగ్రెస్, ఇతర రాజకీయ పార్టీలు ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీప్యాట్) స్లిప్పులను ఓటర్లకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 350 సీట్లు గెలిచింది. 2024 ఎన్నికల్లో 400 మార్కు దాటాలని ప్రయత్నిస్తున్నది.