చెప్పిన మాట వినలే.. ఇప్పుడు చూడండి..

ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆరెస్‌ అభ్యర్థులపై సొంత పార్టీ నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేల వైఖరి వల్లే ఓడిపోవాల్సి వచ్చిందని నిప్పులు చెరుగుతున్నారు.

చెప్పిన మాట వినలే.. ఇప్పుడు చూడండి..

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరు గొంతు విప్పుతున్నారు. ఎమ్మెల్యేల తప్పులను ఎత్తిచూపుతూ నిప్పులు చెరుగుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు రోజులు కావస్తున్నందున నిన్నటి వరకు తమ అభిప్రాయాలను కడుపులో పెట్టుకున్న నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అధికారికంగా ఎక్కడా సమీక్షలు నిర్వహించకపోయినప్పటికీ, ఎమ్మెల్యేల తీరు వల్లనే ఓటమిపాలైనట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒకవిధంగా ఈ ఓటమికి పూర్తి బాధ్యత ఎమ్మెల్యే అభ్యర్థుల తీరే కారణమంటూ మండిపడుతున్నారు. దాదాపు మెజార్టీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అనుసరించిన విధానాలు, పార్టీని, ద్వితీయ శ్రేణి నాయకులను, కేడర్ ను పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యేల ఒంటెద్దు పోకడలు దీనికి తోడయ్యాయని విమర్శిస్తున్నారు. పద్ధతిలో ప్రజా వ్యతిరేకంగా, పార్టీ కేడర్ కు వ్యతిరేకంగా వ్యవహరించగా, ఇక భూ కబ్జాలు, పథకాలలో కమీషన్లు, అక్రమాలు, అవినీతి ఆరోపణలు కారణమంటూ మరోసారి చిట్టా విప్పుతున్నారు.

– మానుకోట నుంచి ప్రారంభం

ఈ వ్యవహారం మహబూబాబాద్ అసెంబ్లీ నుంచి షురూ అయ్యింది. అక్కడి ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ పై ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవిందర్ రావు నిప్పులు చెరిగారు. శంకర్ నాయక్ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఏకపక్షంగా వ్యవహరించారని బహిరంగంగా మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కూడా శంకర్ నాయక్ కు టికెట్ఇవ్వకూడదంటూ వ్యతిరేకంగా రవిందర్ రావు వర్గం అసమ్మతిగళమెత్తింది. పార్టీ అధినాయకత్వం శంకర్ నాయక్ కే టికెట్ ఇవ్వడంతో ఎన్నికలు అయిపోయేంతవరకు నోరిప్పలేదు. ఫలితాలు వెలువడడంతో ఇప్పుడు ఏకంగా విమర్శలు చేపట్టారు.

– తప్పులపై గొంతిప్పుతున్న నాయకులు

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, 11 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. 11 స్థానాల్లో 2 స్థానాలు జనగామ, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాల్లో సిటింగుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. తొమ్మిది స్థానాల్లో సిటింగులు పోటీచేశారు. 9 మందికి 9 మంది ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలోనే జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యేల ఓటమిని జీర్ణించుకోలేకపోవడం ఒక కారణమైతే, ఓటమికి కారణాలను క్రమంగా బహిరంగంగా ప్రదర్శిస్తున్నారు. ఎన్నికలకు ముందే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఒకటి, రెండు సెగ్మెంట్లు మినహా మెజారిటీ స్థానాల్లో సిటింగు ఎమ్మెల్యేలపై సొంతపార్టీ నాయకుల నుంచే విమర్శలు, ఆరోపణలు తీవ్రమయ్యాయి. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఎన్నికల ప్రచారం, ఆర్భాటం, హంగుతో చేపట్టి పోలింగుకు ఒకరోజు ముందు చేతులెత్తేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది.


పోల్ మేనేజ్ మెంట్ చేయకుండా రాత్రికి రాత్రి పట్టనట్లు వ్యవహరించారనే విమర్శలు ఆ పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటూ ఓటమిభయంతో వెనుకంజ వేశారని నరేందర్ అంటే గిట్టిని సీనియర్ నాయకులు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఫిర్యాదు ఫలితంగానే ఆఖరు నిమిషంలో రంగంలోకి దిగి హంగామా చేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే తీరును గ్రహంచిన కొందరు కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తికి గురై బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు చర్చసాగుతోంది. ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని భావించి బీజేపీకి సహకరించారని ప్రచారం సాగుతోంది. ఈకారణంగానే తూర్పులో బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైనట్లు భావిస్తున్నారు. ఈ తప్పులు బయటపడకుండా ఎమ్మెల్యే అభ్యర్థి, ఆయన అనుచరులు వ్యవహరిస్తున్నారని ఆయన వ్యతిరేకులు అప్పుడు ఫిర్యాదులు ప్రారంభించారు.


మానుకోటతో పాటు పరకాల, భూపాలపల్లి ప్రాంతాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ నాయకులను, కేడర్ ను, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించారనే విమర్శలు ప్రారంభమయ్యాయి. ప్రతీ నియోజకవర్గంలో పార్టీ కంటే ఎమ్మెల్యే, ఆయన అనుచరులుగా పార్టీ నిర్మాణం మారిపోయిందని, ఇదంతా కలిసి పార్టీ ఓటమికి కారణమంటున్నారు. డోర్నకల్ లో ఎమ్మెల్యే అనుసరించిన తీరుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ పట్టించుకోలేదనే విమర్శలు చేస్తున్నారు. ఈ కారణంగా ఓటమిపాలైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఓటమితో కొంత గుంభనంగా ఉన్నప్పటికీ కొద్ది రోజుల్లో అన్నీ బహిరంగంగా విమర్శించుకునే పరిస్థితికి వస్తుందంటున్నారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం అనుసరించిన తీరు కూడా ప్రధాన కారణంగా చెబుతున్నారు.