Bus Stop Stolen | రూ. 10 లక్షల విలువ చేసే బస్టాప్ చోరీ.. ఎక్కడంటే..?

Bus Stop Stolen |
ఇండ్లలో, దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడటం చూశాం. బస్టాప్‌ను చోరీ చేయడం ఎప్పుడైనా చూశారా..? కర్ణాటకలో బస్టాప్‌ను దొంగలు చోరీ చేయడం చర్చనీయాంశమైంది. ఆ బస్టాప్ ఏదో మారుమూల ప్రాంతంలో ఉందనుకుంటే పొరపాటే. ఎందుకంటే రాజధాని బెంగళూరు నగరం నడిబొడ్డున ఉంది. అంతే కాదు కర్ణాటక అసెంబ్లీకి కిలోమీటర్ దూరంలోనే ఉండటం విశేషం.
బెంగళూరులోని కన్నింగ్‌హోమ్ రోడ్డులో రూ. 10 లక్షలతో బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ బస్టాప్‌ను ప్రారంభించిన 10 రోజులకే గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. ఆగస్టు 21వ తేదీన బస్టాప్‌ను ప్రారంభించగా, వారం రోజులకు అపహరించారు. దీంతో బస్టాప్‌ను నిర్మించిన కంపెనీ అధికారి రవిరెడ్డి.. స్థానిక పోలీసులకు సెప్టెంబర్ 30వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే చోరీ జరిగిన నెల రోజులకు ఫిర్యాదు చేయడం పట్ల పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొన్నారు. అయితే బస్టాప్ కనిపించకపోవడంతో బృహత్ బెంగళూరు మెట్రోపాలిక అధికారులను సదరు కంపెనీ ప్రశ్నించగా.. వారు తమకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు. ఇక ఈ బస్టాప్‌ను స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసినట్లు కంపెనీ తెలిపింది. బస్టాప్‌తో పాటు దానికి ఉన్న స్టీల్ కడ్డీలను కూడా దొంగలు అపహరించారు.
బస్టాప్‌లు చోరీ కావడం కొత్తేమీ కాదు..
బెంగళూరు నగరంలో బస్టాప్‌లు చోరీ కావడం కొత్తేమీ కాదని స్థానికులు వాపోయారు. హెచ్ఆర్‌బీఆర్ లే అవుట్ వద్ద 30 ఏండ్ల క్రితం నిర్మించిన బస్టాప్‌ను ఈ ఏడాది మార్చిలో రాత్రికి రాత్రే మాయం చేశారు. 1990లో కల్యాణ్ నగర్‌లో లయన్స్ క్లబ్ విరాళంగా ఇచ్చిన బస్టాండ్‌ను కూడా కమర్షియల్ స్పేస్ కోసం రాత్రికి రాత్రే తొలగించారని తెలిపారు. 2015లో హరిజన్ స్కూల్ సమీపంలోని దూపనహల్లి బస్టాప్ రాత్రికి రాత్రే కనిపించకుండా పోయింది. 2014లో రాజరాజేశ్వరినగర్‌లోని బీఈఎంఎల్ లే అవుట్ 3వ స్టేజీలో 20 ఏండ్ల నాటి బస్టాప్‌ను కూడా దొంగలు చోరీ చేశారు.