కూతురి పెళ్లిలో హెల్మెట్లు పంపిణీ చేసిన తండ్రి.. ఎందుకంటే..?
పెళ్లికి వచ్చే వారందరూ వధూవరులకు కానుకలు సమర్పిస్తుంటారు. ఓ వ్యక్తి మాత్రం కూతురి వివాహానికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.

రాయ్‌పూర్ : పెళ్లికి వచ్చే వారందరూ నూతన వధూవరులకు కానుకలు సమర్పిస్తుంటారు. ఇక పెళ్లి నిర్వహించిన వారు రిటర్న్ గిఫ్ట్‌లు కూడా ఇస్తుంటారు. రిటర్న్ గిఫ్ట్‌లుగా మహిళలకు సంబంధించిన బహుమతులు ఇస్తుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం వినూత్నంగా, ఎవరూ ఊహించని విధంగా కూతురి వివాహానికి వచ్చిన అతిథులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛత్తీస్‌గఢ్ కొర్బా జిల్లాలోని ముదపార్ ఏరియాకు చెందిన సేద్ యాదవ్ సోమవారం తన కూతురికి వివాహం జరిపించారు. కూతురు నీలిమ స్పోర్ట్స్ టీచర్‌గా పని చేస్తోంది. అయితే పెళ్లికి వచ్చిన అతిథులకు సేద్ యాదవ్ హెల్మెట్లు పంపిణీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక బంధువులందరూ హెల్మెట్లు ధరించి డ్యాన్సులు చేశారు.
ఈ సందర్భంగా సేద్ యాదవ్ మాట్లాడుతూ.. బైక్‌లపై పెళ్లికి వచ్చిన వారందరికీ హెల్మెట్లు పంపిణీ చేశాను. రోడ్డు సెఫ్టీపై అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితం చాలా విలువైనది. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దని కోరారు. దీని వల్లే చాలా రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయి. మొత్తం 60 మందికి హెల్మెట్లతో పాటు స్వీట్లు పంపిణీ చేసినట్లు సేద్ యాదవ్ తెలిపారు.