Holi Festival | రంగుల కేళీ హోలీ.. ఆనందాల పండుగకు భారతదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు..!

  • Publish Date - March 24, 2024 / 03:19 AM IST

Holi Festival | రంగుల పండుగ హోలీ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఈ పండుగను ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. ఎన్నో విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలున్న భారతదేశంలో ఈ పండుగను ఒక్కోచోట ఒక్కో రంగా జరుపుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా చాలా మంది రంగులతో హోలీ ఆడుకుంటారు. మరికొన్ని చోట్ల పూలతో హోలీని జరుపుకుంటారు. ఒకరికి ఒకరు రంగులు పలుముకుంటూ ఆటలాడుతుంటారు. అయితే, దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో హోలీని ఎలా జరుపుకుంటారో చూసేద్దాం రండి..!

లాత్మార్‌ హోలీ ప్రసిద్ధి బర్సానా..

ఉత్తరప్రదేశ్‌లో హోలికా దహన్ నుంచి రంగుల పండుగ మొదలవుతుంది. బర్సానాకు చెందిన లత్మార్ హోలీ ఎంతో ప్రసిద్ధి చెందింది. రంగుల పండుగ రోజున నంద్‌గావ్‌లోని హుర్రియాలు తమ కవచాలతో బర్సానాకు వెళతారు. అదే సంద‌ర్భంగా బర్సానాలోని గోపికలు ఇక్కడ‌ కర్రలతో హోలీ ఆడతారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో హోలీ పండుగ కనుల పండువగా సాగుతుంది. ఇక్కడ హోలీ వేడుకల్లో ప్రజలు పెద్ద డీజేలు పెట్టి రోడ్లపై డ్యాన్సులు చేస్తుంటారు. అలాగే, వివిధ రకాల వంటకాలను ఆస్వాదిస్తారు. ఢిల్లీలోని చాలా చోట్ల హోలీ పార్టీలు సైతం జరుగుతుంటాయి.

మేదురు హోలీ..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో హోలీని ‘మేదురు హోలీ’ జరుపుకుంటారు. పండుగలో జనమంతా ఉత్సాహంగా పాల్గొని ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ సంగీతం, డాన్సుల‌తో పాటు ఒకరికి ఒకరు రంగులు పలుముకుంటూ సంబరాలు చేసుకుంటారు. హోలీకి ముందురోజు సాయంత్రం హోలికా దహన్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలికా దహన్‌ వెలిగిస్తారు.

మహారాష్ట్రలో రంగ పంచమి..

మహారాష్ట్రలో హోలీని ‘రంగ పంచమి’గా నిర్వహిస్తారు. జనం రంగులతో ఆడుకుంటారు. పాటలు పాడుతూ.. వాయిధ్యాలకు అనుగుణంగా అనుగుణంగా స్టెప్పులు వేస్తారు. అలాగే, సాంప్రదాయ స్వీట్లతోపాటు రుచికరమైన ఆహారాలను ఆస్వాదిస్తుంటారు. అనేక ప్రాంతాలలో ప్రజలు వీధుల్లో పాడటం, సంగీత వాయిద్యాలను వాయిస్తూ వేడుకల్లో పాల్గొంటారు.

కేరళలోని మంజల్ కులీ

కొంకణి, కుదుంబి కమ్యూనిటీలు ఈ పండుగను ఎంతో సంప్రదాయ‌బ‌ద్దంగా నిర్వహిస్తూ వస్తుంటారు. కుటుంబ‌స‌మేతంగా ప్రజలు ఆలయాలను సందర్శిస్తారు. అలాగే జానపద పాటలను ఆల‌పిస్తారు. పండుగ‌లో నీటి రంగులను మాత్రమే ఉప‌యోగిస్తారు. ఈ రంగుల ప్రత్యేకత ఏమిటంటే కేవలం పసుపును ఉపయోగించి మాత్రమే తయారు చేస్తుంటారు.

ఉదయపూర్

రాజుల‌ నగరం ఉదయపూర్‌లో హోలీని వేడుకగా నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. సాయంత్రం స‌మ‌యంలో హోలికా దహన్ పేరుతో హోలికా దిష్టిబొమ్మను ద‌హ‌నం చేస్తారు. ఆపై రాజ‌వంశీయులు బృందంగా ఏర్పడి గుర్రపు ఊరేగింపులు జ‌రుపుతారు. ఈ ఘ‌ట్టాల‌ను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తారు.

బెంగాల్‌లో బసంత్ ఉత్సవ్..

బెంగాల్‌లో వసంత ఆగమన వేడుకగా బ‌సంత్ ఉత్సవ్ పేరుతో హోలీని వేడుకలు నిర్వహిస్తారు. ముఖ్యంగా శాంతినికేతన్‌లో అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రధాన హోలీ వేడుకల్లో డోల్ జాత్రా కీలకఘట్టం. రాధా కృష్ణుల విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు సందర్భంగా ఒక‌రిపై ఒక‌రు నీళ్లు, రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడుపుతారు.

ఉత్తరాఖండ్‌.. కుమావోని హోలీ..

ఉత్తరాఖండ్‌లోని కుమావోని హోలీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భిన్నంగా జరుగుతుంది. కుమావోని హోలీ ప్రత్యేకత ఏమిటంటే.. బైత్కీ హోలీ , ఖరీ హోలీ, మహిళా హోలీ సంగీతతో ముడిపడి ఉంటుంది. ఇవన్నీ వసంత పంచమి నుంచి ప్రారంభమవుతాయి. కుమావోన్‌లో దాదాపు రెండు నెలల పాటు హోలీ ఉత్సవాలు జరుగుతాయి. బైత్కీ హోలీ, ఖరీ హోలీల ప్రత్యేకత పాటలు శ్రావ్యత, వినోదం, ఆధ్యాత్మికత కలయికతో ఉంటాయి. కుమావోన్‌ చుట్టూ అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు.

Latest News