కేటీఆర్‌ను ఆశీర్వదించాలని మోదీని అడిగాను.. ఒప్పుకొన్న కేసీఆర్!
కేటీఆర్‌ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనను కోరారని మోదీ నిజామాబాద్ సభలో చెప్పిన విషయం తెలిసిందే. అది నిజమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఇంటర్వ్యూలో అంగీకరించారు.

- అతనికి సహకరించాలని కోరాను
- 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నా.. ఇక తప్పుకోవాలని ఉందని చెప్పా
- అంతర్గత సంభాషణల్లో చెప్పింది బయట చెప్పడం ప్రధానికి తగునా?
- ఎన్డీఏలోకి రావాలని వారే అడిగారు
- మోదీని వందశాతం చెత్త పాలన
- కాంగ్రెస్ పార్టీ అహంకారి.. విఫల పార్టీ
- విచ్ఛిన్నమైన ఇండియా కూటమి
- ఇక్కడ ఉండే.. దేశానికి సేవ చేస్తా
- ఇండియా టుడే ఇంటర్వ్యూలో సీఎం కేసీఆర్
హైదరాబాద్ : కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తానని, ఆతడిని ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో అన్నారని మోదీ చెప్పిన మాటలు నిజమేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు. అయితే.. అంతర్గత సంభాషణల్లో చెప్పిన మాటలను రాజకీయ వేదికపై చెప్పడం ప్రధాని స్థాయి వ్యక్తికి తగినదేనా? అని ప్రశ్నించారు. ఎన్డీయేలో చేరుతామని తాము ప్రతిపాదించలేదని, వారే అడిగారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్‌హౌస్‌లో ఇండియా టుడే గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రాజ్ చెంగప్ప, సీనియర్ డిప్యూటీ ఎడిటర్ అమరనాథ్ కే మీనన్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. మూడోసారి తమ విజయావకాశాలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. 2018 ఎన్నికల కంటే అధిక స్థానాల్లో బీఆరెస్ గెలుస్తుందని, 95 నుంచి 100 మధ్య సీట్లు తాము కైవసం చేసుకుంటామని పునరుద్ఘాటించారు. అందుకు తమ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ఘనతలే కారణమని చెప్పారు. నిజానికి తాను దేశానికి సేవ చేయాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ చెప్పారు. అయితే.. కేంద్రానికి వెళ్లబోనని, ఇక్కడే ఉంటూ ఆ పని చేస్తానని తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని ఒపీనియన్ పోల్స్ సంకేతాలిస్తున్న అంశాన్ని ప్రస్తావించగా.. అటువంటిదేమీ లేదని సీఎం కేసీఆర్ కొట్టిపారేశారు. నిజానికి ప్రభుత్వ అనుకూలత ఉన్నదని చెప్పారు.
ఎన్డీయేలో చేరాలని వారే అడిగారు
2021లో ఎన్డీయేలో చేరుతామని మీరు తనను కలిశారని ప్రధాని మోదీ ఇటీవల నిజామాబాద్ మీటింగ్‌లో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. అది నిజమేనా? అని ఇండియాటుడే ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘ప్రధాని తన నోటికి వచ్చిన కట్టుకథలు చెబితే నేనేం చేయను? నిజం ఏమిటంటే.. నేను సీఎం. ఆయన ప్రధాని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కనీస సంబంధాలను కొనసాగించడం నాకు అవసరం. ఎన్డీయేలో చేరాలని వాళ్లే మమ్మల్ని అడిగారు. కానీ నేను మాత్రం.. ముందుగా రాష్ట్రానికి ఏదైనా మంచి చేయండి.. అప్పుడు ఆలోచిస్తాను అని చెప్పాను. కానీ.. వారు తెలంగాణకు ఎలాంటి మంచినీ చేయలేదు. మోదీ ప్రధాని కాకపోతే.. మా రాష్ట్ర తలసరి ఆదాయం నాలుగు లక్షల రూపాయలకు వెళ్లి ఉండేది. ఆయన చాలా వాటిని ఆపేశారు. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంపై ఫిర్యాదులు చేసేవారు. కానీ.. ఇప్పుడు వారి సొంత గవర్నర్లే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను సైతం అడ్డుకుంటున్నారు. ఇది నేరపూరితం. తెలంగాణ గవర్నర్ తమిళనాడు బీజేపీ శాఖకు అధ్యక్షురాలిగా పనిచేశారు. ఇప్పుడు ఆమె అనేక బిల్లులను అడ్డుకోవడం ద్వారా అవివేకంతో, థర్డ్‌క్లాస్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు’ అని అన్నారు.
అంతర్గత సభాషణలు బయటపెట్టడం తగునా?
మీ కుమారుడిని తెలంగాణలో మీ వారసుడిని చేయడానికి తన ఆశీర్వాదం కోరారని మోదీ చెప్పడాన్ని ప్రస్తావించగా.. ‘అంతర్గత సంభాషణల్లో.. నాకు 70 ఏళ్లు వచ్చాయి.. ఇప్పటికే 50 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నందున ఇక రిటైర్ అవ్వాలనుకుంటున్నానని చెబితే.. దానిని మోదీ బహిరంగంగా చెప్పొచ్చునా? ఆ తర్వాత ఆయన నా కుమారుడి గురించి అడిగారు. దాంతో నేను.. మీరు ప్రధాని కనుక మీ ఆశీర్వాదాలు అందించి, అతనికి సహకరించండి అని కోరాను. ఇటువంటి వ్యక్తిగత సంభాషణలను రాజకీయ వేదికపై బయటపెట్టడం ప్రధానికి తగునా?’ అని కేసీఆర్ ప్రశ్నించారు. రెండు సీట్ల నుంచి పోటీ చేయడానికి తన కారణాలు తనకు ఉన్నాయని, ఎన్నికల ఫలితాల అనంతరం ఆ విషయాన్ని బయటపెడతానని అన్నారు. తమ ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరిపైనా అవినీతి ఆరోపణలు లేవని కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతి కారణంగా ఏ ఒక్క మంత్రినీ తొలగించలేదని చెప్పారు. గత పదేళ్లలో ఒక్క వికెట్ కూడా పడలేదని వ్యాఖ్యానించారు. భూకబ్జాల్లేవు.. లంచాల వసూళ్లు లేవు. తెలంగాణ అవినీతి రాష్ట్రమైతే ఇన్వెస్టర్లు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు ఎందుకు వస్తాయి? అని ప్రశ్నించారు. గతంలోకానీ, ఈసారికానీ ఎమ్మెల్యేలను మార్చకపోవడానికి కారణం.. వారు తమ ఉద్యమంలో భాగస్వాములు కావడమేనని చెప్పారు. వారి అంకిత స్వభావం తనకు తెలుసని పేర్కొన్నారు. ప్రజల్లో ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత లేనప్పుడు తాను వారిని ఎందుకు మార్చుతానని అన్నారు. నాయకత్వ కేంద్రీకరణ ఉంటందని, మొత్తం అధికారాలన్నీ మీ చేతిలోనే ఉంటాయని అంటుంటారు.. అది సరైన అంచనాయేనా? అన్న ప్రశ్నకు.. అన్నింటిలో కాకపోయినా కొన్నింటిలో కేంద్రీకృతం అవసరమేనని చెప్పారు. తెలంగాణ సాధకుడిగా కొన్ని కీలక అంశాల్లో కచ్చితంగా తానే నిర్ణయాలు తీసుకుంటానని తెలిపారు. రాష్ట్రం అవసరాలు తనకు తెలుసన్నారు. ఇది కొందరికి నచ్చకపోవచ్చని వ్యాఖ్యానించారు. కానీ.. నిర్ణయాలు తీసుకునేముందు తన మంత్రివర్గంతో సుదీర్ఘ చర్చ జరుపుతానని తెలిపారు. సంక్షేమ పథకాల కేటాయింపులో ఎమ్మెల్యేల పాత్ర ఏమీ ఉండదని సీఎం చెప్పారు. బహిరంగంగా లాటరీ తీసి, లబ్ధిదారులను ఎంపిక చేస్తామని తెలిపారు. మూడు లక్షల ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చామని, కట్టి, అందించామని చెప్పారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు.
మేడిగడ్డ కుంగడానికి కుట్ర జరిగిందని అనుమానం
అవినీతి, నిర్లక్ష్యం కారణంగానే మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావించగా.. కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల నీటిపారుదల వ్యవస్థ అని, అందులో వందల పిల్లర్లు ఉంటే ఒకటి మాత్రమే కుంగిపోయిందని కేసీఆర్ చెప్పారు. కుట్ర చేయడం వల్లే అది కుంగిపోయిందని తాను ఇప్పటికీ అనుమానిస్తున్నానని, పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. ప్రాజెక్టును ఎల్‌అండ్‌టీ కంపెనీ నిర్మించిందని, ఎదైనా తప్పిదం ఉంటే ఆ కంపెనీయే సొంత ఖర్చుతో మరమ్మతు చేస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి నష్టం ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ లక్ష కోట్లు అవినీతికి పాల్పడినట్టు కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ పసలేనిదన్నారు. మొత్తం ప్రాజెక్టు ఖర్చే 80వేల కోట్లని చెప్పారు.
మోదీది వందశాతం దారుణ పాలన
ప్రధాని మోదీ పనితీరును ఎలా అంచనా వేస్తారన్న ప్రశ్నకు.. వందశాతం దారుణమైన పాలన అని కేసీఆర్ చెప్పారు. రూపాయి విలువనే ఉదాహరణగా తీసుకుంటే.. మునుపెన్నడూ లేనంతగా పతనమైందని అన్నారు. ఇప్పుడు డాలరు 83.4 రూపాయలు అయిందన్నారు. దేశంలో యాభై శాతం పరిశ్రమలు మూతపడ్డాయని చెప్పారు. గతంలో మేధో వలసలు ఉండేవని, కానీ ఇప్పుడు పెట్టుబడులే తరలిపోతున్నాయని విమర్శించారు. ప్రజల మాదిరిగానే ఇన్వెస్టర్లు వేలల్లో కాదు.. లక్షల్లో దేశం వదిలిపోతున్నారని చెప్పారు. దేశాన్ని ఐదు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చుతామని చెప్పడం పనికిమాలిన మాటలన్నారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే.. వారిలో 60శాతం యువతేనని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవని అన్నారు. దళితులు, గిరిజనులు, ఓబీసీలు, రైతులకు కేంద్ర ప్రభుత్వం చేసిన ఒక్క మంచి పని అయినా ఉన్నదా? అని ప్రశ్నించారు.
కవితపై కేసు రాజకీయ దురుద్దేశంతోనే
తన కుమార్తె కవితపై పెట్టిన కేసు వందశాతం రాజకీయ దురుద్దేశపూరితమేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. దీనిపై తాము కోర్టులోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు. అది ఢిల్లీకి సంబంధించిన మద్యం విధానమని, పైగా అంతా బాహాటంగానే జరిగిందని చెప్పారు. వాళ్లు వారి ఆదాయాన్ని పెంచుకోవడానికి విధానాన్ని మార్చుకున్నారని, అందులో కుంభకోణం ఏమున్నదని ప్రశ్నించారు. ఇది కల్పిత కేసు అన్నారు. తమకు బీజేపీతో సంబంధం లేదని, తాము తమ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించబోతున్నామని తెలిపారు.
మోసం చేసింది సోనియానే
తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో టీఆరెస్‌ను విలీనం చేస్తామని హామీ ఇచ్చి, మాట తప్పారని కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా.. నిజానికి మోసం చేసింది సోనియాగాంధీయేనని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఇవ్వడానికే సుదీర్ఘ ప్రక్రియ నడిచిందన్నారు. తర్వాత తాను సోనియాగాంధీని కలిసి.. ఇప్పటికైనా తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపానని చెప్పారు. ‘అప్పుడు ఆమె ఎన్నికల గురించి అడిగారు. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు, పార్టీ పదవులు తమకు ఇస్తే కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి అభ్యంతరం లేదని చెప్పాను. ఆమె అంగీకరించారు. పార్టీలో మాట్లాడుతానని చెప్పారు. కానీ.. మరుసటి రోజు దిగ్విజయ్‌సింగ్ ఫోన్ చేసి.. సీట్ల కేటాయింపు అనేది కాంగ్రెస్ పద్ధతుల్లోనే జరుగుతుందని, నాయకత్వం విషయంలో ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తమకు వంతపాడమన్నట్టు మాట్లాడారు. దాంతో మేం సర్వే నిర్వహించుకున్నాం. అందులో మాకు 50కంటే ఎక్కువ సీట్లే వస్తాయని తేలింది.. మెజార్టీ వస్తుందని స్పష్టమైంది. అదృష్టవశాత్తూ ప్రజలు మాకు సంపూర్ణ మెజార్టీ కట్టబెట్టారు.. మేం అధికారంలోకి వచ్చాం. ఇందులో కాంగ్రెస్‌ను మోసం చేసిన ప్రశ్న ఎక్కడిది?’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఒక విఫల పార్టీ అని కేసీఆర్ అభివర్ణించారు. ఆ పార్టీలో ఒక వ్యవస్థ అంటూ లేదని, అహంకారపూరిత పార్టీ అని చెప్పారు. పైగా.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఉంటుందని విమర్శించారు. ‘వాళ్లు కర్ణాటక వెళ్లి ఒకటి చెబుతారు. తెలంగాణకు వచ్చి మరొకటి చెబుతారు.. వేరే చోటుకు పోయి.. ఇంకొకటి చెబుతారు.. మీరు జాతీయ పార్టీ అని చెప్పుకొంటున్నప్పుడు మీకు వ్యక్తిత్వం ఉండాలి. కానీ.. కాంగ్రెస్‌లో లేనిదే అది’ అని కేసీఆర్ అన్నారు. ఇండియా కూటమి ఇప్పటికే విచ్ఛినమైందని చెప్పారు. అఖిలేశ్‌యాదవ్ ఆ కూటమి నుంచి బయటకు వచ్చేశారని, నితీశ్‌కుమార్ ప్రతి రోజూ తిడుతున్నారని అన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాంగ్రెస్‌లో ఉండదన్న కేసీఆర్.. జాతీయ పార్టీ ఎప్పుడూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటూ.. ప్రజలను వెంట తీసుకుపోవాలని చెప్పారు.