ఆ కార‌ణం వ‌ల‌న‌ కొన్నాళ్ల వ‌ర‌కు బ్యాట్ ప‌ట్టుకోనంటున్న ఇషాన్ కిష‌న్.. ఫ్యాన్స్ షాక్

ఆ కార‌ణం వ‌ల‌న‌ కొన్నాళ్ల వ‌ర‌కు బ్యాట్ ప‌ట్టుకోనంటున్న ఇషాన్ కిష‌న్.. ఫ్యాన్స్ షాక్

టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు.అద్భుత‌మైన టాలెంట్ ఉన్న ఈ క్రికెట‌ర్‌కి స‌రైన అవకాశాలు రాక‌పోవ‌డం వ‌ల‌న ఆయ‌న కెరీర్ అంత స‌జావుగా సాగ‌డం లేదు. ఈ క్ర‌మంలోఏ తన కెరీర్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఆటకు దూరంగా ఉండాలని ఈ 25 ఏళ్ల యువ బ్యాటర్ నిర్ణయించుకున్న‌ట్టు తెలుస్తుంది. మాన‌సిక ఒత్తిడి వ‌ల‌న కొన్నాళ్ల పాటు క్రికెట్‌కి దూరంగా ఉండాల‌ని తాను భావిస్తున్న‌ట్టు ఇషాన్ కిష‌న్ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) చెప్ప‌గా.. ఇందుకు బోర్డు కూడా అనుమ‌తి ఇచ్చింది. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాఫ్రికాతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడ‌ట‌.

మానసికంగా అల‌సిపోవ‌డంతోనే ఇషాన్ కిషాన్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా చెబుతున్నారు.టీ20, వన్డే సిరీస్‌లో అవకాశం దక్కకపోయినా.. టెస్ట్ సిరీస్‌లో ఇషాన్ ఆడతాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ఇషాన్ కిషన్ సౌతాఫ్రికా పర్యటన నుంచి స్వదేశం తిరిగి వచ్చాడని బీసీసీఐ వర్గాలు చెప్పుకొచ్చాయి. కొన్నాళ్ల‌పాటు ఇషాన్ ఆట‌కు పూర్తిగా దూరం కానున్నాడు.వన్డే ప్రపంచకప్‌లో శుభ్‌మన్ గిల్‌ అస్వస్థతతో బాధపడటంతో తొలి రెండు మ్యాచ్‌లలో ఇషాన్ కిషన్ అవ‌కాశం ద‌క్కించుకోగా, ఆ మ్యాచ్‌ల‌లో బాగానే రాణించాడు. ఎప్పుడైతే గిల్ వ‌చ్చాడో ఇషాన్‌ని ప‌క్క‌న పెట్టేశారు మేనేజ్‌మెంట్‌.

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో నిలకడగా రాణించిన ఇషాన్ కిషన్.. సౌతాఫ్రికా పర్యటనలో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోవ‌డం కూడా అత‌నికి కొంత ఇబ్బందిని క‌లిగించి ఉంటుంది. దక్షిణాఫ్రికాతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు తాను ఎంపికైనా.. తొలి ప్రాధాన్యత కేఎల్ రాహుల్‌కే ఉండటంతో ఇక తాను త‌ప్పుకున్న‌ట్టే అని అనుకున్న ఇషాన్.. స్వదేశానికి వచ్చి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఐపీఎల్ వరకు ఆటకు దూరంగా ఉండాలని ఇషాన్ కిషన్ భావిస్తున్న‌ట్టు ప‌లు మీడియా నివేదిక‌లు చెబుతున్నాయి. కాగా ఈ ఏడాది ఇషాన్ కిషన్ రెండు టెస్ట్‌లతో పాటు 17 వన్డేలు, 11 టీ20లు ఆడాడు. మొత్తం 29 ఇన్నింగ్స్‌ల్లో 29.64 సగటుతో 741 పరుగులు చేసిన ఇషాన్‌కి ఏడు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.ఇక ఇషాన్ విరామం కోర‌డంతో అత‌డి స్థానంలో తెలుగు ఆట‌గాడు కేఎస్ భ‌ర‌త్‌కు అవ‌కాశం ల‌భించింది. ఇప్ప‌టికే గాయాల కార‌ణాల మ‌హ్మ‌ద్ ష‌మీతో పాటు రుతురాజ్ గైక్వాడ్‌లు టెస్టు సిరీస్‌కు దూరం అయిన విష‌యం విదిత‌మే.