తెలంగాణ కాంగ్రెస్ నేతల ఇండ్లలో ఐటీ సోదాలు

తెలంగాణలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్) నివాసంలో, బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
శంషాబాద్‌లోని కేఎల్ఆర్ ఇల్లు, ఫామ్ హౌస్‌తో పాటు మరో పది ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోదాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను లోపలికి వెళ్లనివ్వడం లేదు. లోపలి వ్యక్తులను బయటకు రానివ్వడం లేదు. తెల్లవారుజామున 5 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి.
మహేశ్వరం టికెట్ ఆశించిన బడంగ్‌పేట్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం పారిజాతనర్సింహారెడ్డి తిరుపతిలో ఉన్నారు. ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. నర్సింహారెడ్డి ఇంట్లో ఆయన కూతురు, తల్లి మాత్రమే ఉన్నారు. వీళ్లతోపాటు బాలాపూర్ లడ్డు వేలం దక్కించుకున్న వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.