Uttar Pradesh | భార్యను శాంతింపజేసేదుకు పట్టాలపై కౌగిలింత.. అంతలోనే ఢీకొట్టిన రైలు

Uttar Pradesh | ఇది హృదయవిదారక ఘటన. పట్టాలపై కోపంతో నిల్చున్న భార్యను శాంతింపజేసేందుకు భర్త ఆమెను కౌగిలించుకున్నాడు. అంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. గోవింద్ సోంకర్(30), కుష్బూ సోంకర్(28)కు కొన్నేంల్ల క్రితం వివాహమైంది. వీరికి 6, 3, 2 ఏండ్ల వయసున్న కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే గోవింద్ మద్యానికి బానిసగా మారాడు. నిత్యం తాగొచ్చి కుటుంబ సభ్యులు వేధిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి భార్యాభర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మానేయాలని భార్య కోరింది. భర్త తిరస్కరించాడు.
దీంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురై సమీపంలో ఉన్న పంచకోషి రైల్వే క్రాసింగ్ వద్దకు వెళ్లి, పట్టాలపై నిల్చుంది. భర్త కూడా ఆమెను అనుసరించాడు. భార్యను శాంతింపజేసేందుకు ఆమెను కౌగిలించుకున్నాడు భర్త. అంతలోనే వేగంగా దూసుకొచ్చిన రైలు వారిద్దరిని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న సారనాథ్ పోలీసులు, మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.