అన్నం వడ్డించలేదని.. కన్న తల్లికి నిప్పు పెట్టిన కుమారుడు

ఓ కుమారుడు దారుణానికి పాల్పడ్డాడు. అన్నం వడ్డించలేదని కన్న తల్లికి నిప్పు పెట్టాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయఘడ్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాయఘడ్ జిల్లాలోని నౌకర్ గ్రామంలో చంగునా నామ్‌దియో ఖోట్ అనే మహిళ తన 26 ఏండ్ల కుమారుడితో కలిసి నివసిస్తోంది. అయితే మంగళవారం రాత్రి అన్నం వండి, వడ్డించే విషయంలో తల్లీకుమారుడి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో తల్లిని చితకబాదిన కుమారుడు, ఆమెను ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చాడు. కట్టెల్లో ఆమెను తోసేసి నిప్పంటించాడు.
అగ్నికీలల ధాటికి తట్టుకోలేక ఆమె కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలతో బాధపడుతూ, బుధవారం ఉదయం కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కుమారుడు జయేశ్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.