సెకండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చాటుతున్న ఇంగ్లండ్.. భారత్ బౌలర్స్‌ని ధీటుగా ఎదుర్కొంటున్న ఇంగ్లీష్ జట్టు

హైదరాబాద్ వేదికగా ఇండియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో త్వరగానే ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారత స్పిన్ త్రయాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. అలానే బుమ్రా, సిరాజ్ బౌలింగ్ లో కూడా సులువుగా ఆడుతూ భారీ స్కోరు సాధిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే ఔటయిన యువ బ్యాటర్ ఓలీ పోప్ (208 బంతుల్లో 148 నాటౌట్, 17 ఫోర్లు) అజేయ శతకంతో చెలరేగడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 77 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పోప్‌తో పాటు రిహాన్ అహ్మద్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు ఇప్పటికే 126 పరుగుల ఆధిక్యంలో ఉంది.
భారత్-ఇంగ్లాండ్ మొదటి మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 436 పరుగులకు ఆలౌట్ అయింది. జైస్వాల్ 80 పరుగులు, కేఎల్ రాహుల్ 86 పరుగులు, రవీంద్ర జడేజా 87, శ్రీఖర్ భరత్ 41 పరుగులు, అక్షర్ పటేల్ 44 పరుగులు చేశారు. ఈ క్రమంలో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో 190 పరుగులు అధిక్యం లభించింది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టుని త్వరగానే చుట్టేస్తారని అందరు భావించారు. కాని ఇంగ్లీష్ జట్టు మాత్రం ధీటుగా ఎదుర్కొంది. జట్టు ఓపెనర్లు జాక్ క్రాలే (31), బెన్ డకెట్ (47)లు ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 9 ఓవర్లలోనే 45 పరుగులు జోడించారు. డకెట్‌ను బుమ్రా ఔట్ చేయగా క్రాలేను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. ఇదే క్రమంలో భారత్.. జో రూట్ (2), జానీ బెయిర్ స్టో (10), బెన్ స్టోక్స్ (6) వికెట్లను త్వరగానే కోల్పోయారు.
ఒకవైపు వెంటవెంటనే వికెట్స్ కోల్పోతున్నా కూడా పోప్ మాత్రం పరుగుల వరద పారించాడు. 54 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన అతడు.. ఆ తర్వాత నెమ్మదించాడు. బెన్ ఫోక్స్ (81 బంతుల్లో 34, 2 ఫోర్లు) తో ఆరో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫోక్స్ ఔట్ అయినా రిహాన్ తో కలిసి ఇంగ్లండ్ స్కోరుబోర్డును ముందుకు నడిపిస్తున్నాడు. ఇక నాలుగో రోజు ఇంగ్లండ్‌ని భారత్ త్వరగా ఆలౌట్ చేస్తేనే భారత్ గెలిచే అవకాశం ఉంది. లేదంటే భారత జట్టు ఇబ్బందుల్లో పడడం ఖాయంగా కనిపిస్తుంది.