• Telugu News
  • /Latest news

Woman Attack Liquor Shops In UP : లిక్కర్‌ షాపులపై మహిళల మూకుమ్మడి దాడి.. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌ ధ్వంసం

మద్యంపై మహిళల యుద్ధం! యూపీలో 150 మంది మహిళలు ఏకమై రెండు వైన్ షాపులపై దాడి. రూ. 15 లక్షల విలువైన సీసాలు ధ్వంసం. తాగుబోతుల వేధింపులు భరించలేకే ఈ చర్య.

Reported by: Tejaswini Nanna | జాతీయం | Feb 06, 2026, 4:07 pm IST
Read Time: 5 mins
Woman Attack Liquor Shops In UP : లిక్కర్‌ షాపులపై మహిళల మూకుమ్మడి దాడి.. రూ.15 లక్షల విలువైన మద్యం బాటిల్స్‌ ధ్వంసం

నివాసిత ప్రాంతంలో మద్యం దుకాణాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చిన్న పిల్లలు, మహిళలు సాయంత్రం అయితే బయట తిరిగే పరిస్థితి లేదు. దేశంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. సాయంత్రం అయితే చాలు తాగుబోతులు ఫుల్‌గా మద్యం సేవించి మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ పరిస్థితికి విసిగిపోయిన కొందరు మహిళలు విశ్వరూపం చూపించారు. మద్యం దుకాణాలపై దాడి (women attacked liquor shops) చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో చోటు చేసుకుంది.

లలిత్‌పూర్ (Lalitpur) జిల్లాలోని మహరోని ప్రాంతంలో మద్యం దుకాణాల వల్ల తమ దైనందిన జీవితాలు దెబ్బతింటున్నాయని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ వీధుల్లో తాగుబోతుల ఆగడాలతో విసిగిపోయిన మహిళలు మద్యం దుకాణాలపై మూకుమ్మడి దాడి చేశారు. సుమారు 150 మంది మహిళలు రెండు మద్యం దుకాణాలపై దాడి చేశారు. వాటిని ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు.

రూ.15లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం

రెండు మద్యం దుకాణాల్లోకి ప్రవేశించిన మహిళలు అక్కడ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం సుమారు రూ.15 లక్షల విలువైన మద్యం సీసాలను రోడ్డుపై విసిరేసి పగలగొట్టారు. మద్యం బాటిల్స్‌ను ధ్వంసం చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్థానికులు సైతం వారికి మద్దతుగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

వేధింపులు పెరిగాయి..

గ్రామంలో వరుసగా మద్యం దుకాణాలు తెరవడం వల్ల పురుషులు మద్యానికి బానిసైనట్లు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల బహిరంగ ప్రదేశాల్లో వేధింపులు పెరిగిపోయినట్లు చెప్పారు. అంతేకాకుండా గృహహింస కేసులు కూడా ఎక్కువయ్యాయని ఆవేదన చెందారు. ఇంట్లో నిత్యావసరాల కోసం దాచుకున్న డబ్బును కూడా మగాళ్లు మద్యం కోసం ఖర్చు చేయడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి చితికిపోతోందని వారు వాపోయారు.

పట్టించుకోని అధికారులు..

తమ సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని మహిళలు ఆరోపించారు. ఈ మేరకు ప్రధాన రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. తమ చర్యకు తక్షణ స్పందన లేకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

 

ఇవి కూడా చదవండి :

Marriage Scam : టార్గెట్ క‌ట్నం, పెళ్లే వ్యాపారం.. యూపీ వ్య‌క్తి భారీ మ్యారేజ్ స్కామ్‌
BRS MLA Disqualification Case : అప్పటిలోగా తేల్చకపోతే చర్యలు : స్పీకర్ కు సుప్రీం డెడ్ లైన్!