జ‌డేజా త‌ప్పిదంతో ఔటైన స‌ర్ఫ‌రాజ్.. కోపంతో క్యాప్ విసిరేసిన రోహిత్ శ‌ర్మ‌

జ‌డేజా త‌ప్పిదంతో ఔటైన స‌ర్ఫ‌రాజ్.. కోపంతో క్యాప్ విసిరేసిన రోహిత్ శ‌ర్మ‌

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ రాజ్ కోట్ వేదిక‌గా నేడు ప్రారంభ‌మైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో రవీంద్ర జడేజా 110 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 1 పరుగుతో నాటౌట్‌గా ఉన్నారు. అయితే మ్యాచ్ మొద‌లైన కొద్ది సేప‌టికి యశస్వి జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్(0) వెంట‌వెంట‌నే పెవీలియ‌న్ బాట ప‌ట్టారు. ఆ త‌ర్వాత రజత్ పటీదార్(5)ను టామ్ హార్ట్‌లీ ఔట్ చేయడంతో 33 పరుగులకే భారత్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది.ఈ స‌మ‌యంలో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా మధ్య 204 పరుగుల భాగస్వామ్యం నెల‌కొప్పారు.

హార్ట్‌లీ వేసిన 13వ ఓవర్‌లో రోహిత్ శర్మ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో జో రూట్ నేలపాలు చేయ‌డంతో ఇంగ్లండ్ భారీ మూల్యం చెల్లించుకుంది. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్‌కి లైఫ్ లభించడంతో అత‌ను ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) చేయ‌గా, మార్క్ వుడ్ బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు ఆ త‌ర్వాత సర్ఫ‌రాజ్ క్రీజులోకి వ‌చ్చాడు. గత మూడేళ్లుగా దేశవాళీ ట్రోఫీలో పరుగుల వరద పారిస్తున్నస‌ర్ఫ‌రాజ్‌ ఎట్టకేలకు టీమిండియా టెస్టు క్యాప్‌ను అందుకొని తొలి టెస్ట్‌లోనే అద్భుతంగా రాణించాడు. వ‌న్డే మ్యాచ్ మాదిరిగా క్రికెట్ ఆడిన సర్ఫ‌రాజ్ 48 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ చేశాడు. అయితే మ‌రోవైపు అత‌ని పార్ట్న‌ర్ అయిన జ‌డేజా కూడా సెంచ‌రీకి చేరువ‌య్యాడు.

జ‌డేజా 99 పరుగుల వద్ద ఉన్నప్పుడు అండర్సన్ బౌలింగ్‌లో సింగిల్‌కు యత్నించి సర్ఫరాజ్‌ను పిలిచాడు. అయితే కొద్ది దూరం వ‌చ్చి నో అని చెప్పాడు. కాని అప్ప‌టికే సర్ఫరాజ్ స‌గం పిచ్ దాటాడు. తిరిగి క్రీజులోకి వెళ్లేలోపు మార్క్ వుడ్.. బుల్-త్రో వేశాడు. ఫలితంగా సర్ఫరాజ్ ర‌నౌట్‌గా వెనుదిరిగాడు. ఇది డ్రెస్సింగ్ రూమ్ నుండి చూసిన రోహిత్ కోపంతో ఊగిపోతూ ఫ్రస్టేషన్‌తో క్యాప్ తీసి నేలకేసి కొట్టాడు. మరోవైపు జడేజా సెల్ఫిష్ అంటూ ట్విటర్‌లో అత‌డిని తెగ ట్రోల్ చేస్తున్నారు. కీల‌క స‌మ‌యంలో జ‌డేజా సెంచ‌రీ చేసిన‌ప్ప‌టికీ అత‌ను స్వార్థం వ‌ల‌న సెంచ‌రీ చేసే సర్ఫ‌రాజ్ అన‌వ‌స‌రంగా ర‌నౌట్ అయ్యార‌ని కొంద‌రు ఆగ్ర‌హం వ్యక్తం చేస్తున్నారు.