WPL 2024 Final | డబ్ల్యూపిఎల్-2024 కప్ బెంగళూరుదే.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 17ఏళ్ల దాహాన్ని మహిళల జట్టు తీర్చింది. టోర్నీ ఆద్యంతమూ అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు ఆఖరి మెట్టుపై బోల్లాపడింది.

మొత్తానికి అబ్బాయిలు చేయలేనిది అమ్మాయిలు చేసి చూపించారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ 17ఏళ్ల దాహాన్ని మహిళల జట్టు తీర్చింది. టోర్నీ ఆద్యంతమూ అద్భుతంగా రాణించిన ఢిల్లీ జట్టు ఆఖరి మెట్టుపై బోల్లాపడింది.

WPL 2024 Final | రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 17 సంవత్సరాల కల నెరవేరింది. బెంగ తీరింది. 2008లో ఐపీఎల్ మొదలైన నాటి నుంచి గత ఏడాది వరకూ కప్ కోసం పోరాడుతున్న ఆ జట్టుకు ఎట్టకేలకు ‘విన్నర్’ హోదా దక్కింది. ఐపీఎల్‌లో ప్రతి సీజన్ మొదలయ్యే ముందు ‘ఈ సాలా కప్ నమ్దే’ అంటూ హడావుడి చేసి తీరా అసలైన మ్యాచ్‌లలో ఓడిపోతూ వెనుదిరిగే పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా మిగిలిన ‘ఛాంపియన్స్’ కలను ఉమన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో అమ్మాయిలు నెరవేర్చారు. తొలి సీజన్‌లో పురుషుల జట్టు మాదిరిగానే విఫలమైనా రెండో సీజన్‌లో మాత్రం విజేతగా నిలిచారు. డబ్ల్యూపీఎల్ – 2024 ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించిన ఆర్సీబీ ఛాంపియన్స్‌గా తొలి ట్రోఫీని సొంతం చేసుకుంది. వాస్తవానికి ముంబయితో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనే బెంగళూరు ఆశ్చర్యకరంగా గెలిచింది. ఎలిమినేటర్, ఫైనల్.. ఈ రెండింటిలోనూ ప్రత్యర్థిని విపరీతమైన ఒత్తిడిలోకి నెట్టడంలో స్మృతి మంధాన జట్టు సఫలమైంది.
ఢిల్లీని కూల్చిన స్పిన్ త్రయం..
ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముగిసిన ఫైనల్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 18.3 ఓవర్లలో 113 పరుగులకే కట్టడి చేసిన ఆర్సీబీ తర్వాత లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన బెంగళూరు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ను స్పిన్‌తో తిప్పేసింది. ఆర్సీబీ స్పిన్ త్రయం శ్రేయాంక పాటిల్ (4/12), సోఫీ మొలినెక్స్ (3/20), ఆశా శోభన (2/14)లు కట్టడిచేయడంతో ఢిల్లీ మొదట 113 పరుగులకే ఆలౌట్ అయింది. షఫాలీ వర్మ (27 బంతుల్లో 44, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా మెగ్ లానింగ్ (23), రాధా యాదవ్ (12), అరుంధతి రెడ్డిలు (10)లు మినహా మిగిలినవారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

స్పల్ప ఛేదనలో..
స్వల్ప ఛేదనలో ఆర్సీబీ ఏమాత్రం హర్రీబెర్రీ లేకుండా ఆడింది. ఓపెనర్లు స్మృతి మంధాన (39 బంతుల్లో 31, 3 ఫోర్లు), సోఫీ డెవిన్ (27 బంతుల్లో 32, 5 ఫోర్లు, 1 సిక్సర్) లు 8 ఓవర్లలో 49 పరుగులు జోడించారు. శిఖా పాండే.. డెవిన్‌ను ఔట్ చేసి ఢిల్లీకి తొలి బ్రేక్ ఇచ్చింది. కానీ.. ఎల్లీస్ పెర్రీ (35 బంతుల్లో 37 నాటౌట్, 4 ఫోర్లు), మంధానలు రెండో వికెట్‌కు 33 పరుగులు జోడించారు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఆ జట్టును విజయం వైపు నడిపించారు. ఆర్సీబీ విజయానికి మరో 32 పరుగులు అవసరమనగా మంధాన ఔట్ అయినా.. పెర్రీ ఆ జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆఖరి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. రిచా ఘోష్ (14 బంతుల్లో 17 నాటౌట్, 2 ఫోర్లు) గెలుపు పరుగులు చేసింది.
ఆర్సీబీ తొలిసారి
ఐపీఎల్‌లో ఆరంభ సీజన్ (2008) నుంచి ఆడుతున్నా ఆర్సీబీ ఇంతవరకూ ట్రోఫీని నెగ్గలేదు. 2009, 2011, 2016లలో ఆ జట్టు ఫైనల్ చేరినా ట్రోఫీ నెగ్గలేకపోయింది. విజయ్ మాల్యా కలల జట్టయిన ఆర్సీబీ పురుషుల జట్టు ఇంతవరకూ కప్ నెగ్గకపోయినా, అమ్మాయిలు మాత్రం రెండో ప్రయత్నంలోనే ఆ కల నెరవేర్చారు.
ఢిల్లీకి రెండో‘సారీ’
ఢిల్లీ కూడా పురుషుల ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు అనుబంధ ఫ్రాంచైజీనే.. ఈ జట్టు సైతం 2008 నుంచే ఐపీఎల్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) లో ఉన్నా మధ్యలో పేర్లు మార్చుకున్నా ఆ జట్టు కూడా ట్రోఫీ నెగ్గలేదు. డబ్ల్యూపీఎల్‌లో రెండుసార్లు ఫైనల్ చేరినా తుదిపోరులో ఢిల్లీ రెండుసార్లూ రన్నరప్‌గానే నిలిచింది