ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌కి అంపైర్‌గా మారిన శ్రేయాస్ అయ్యర్.. అంద‌రు షాక్

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌కి అంపైర్‌గా మారిన శ్రేయాస్ అయ్యర్.. అంద‌రు షాక్

ప్ర‌స్తుతం వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 చాలా రంజుగా సాగుతుంది. క్రికెట్ ప్రియుల నుండి కూడా ఈ లీగ్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టికలో ముంబై ఇండియ‌న్స్ టాప్‌లో ఉండగా, ఆ త‌ర్వాత స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) నిలిచింది. అయితే ఈ సీజ‌న్‌లో భాగంగా గ‌త రాత్రి గుజరాత్ జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఘ‌న విజ‌యం సాధించింది. సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఆర్సీబీ త‌ర‌పున బౌలింగ్‌లో సోఫీ మోలినక్స్(3/25), రేణుక సింగ్(2/14) సత్తా చాటగా.. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (27 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 43), సబ్బినేని మేఘన(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) అద్భుతంగా ఆడి ఆర్సీబీని గెలిపించారు.

అయితే ఈ మ్యాచ్‌కి సంబంధించిన ఒక ఫొటో బ‌య‌ట‌కు రాగా, ఇది చూసి అంద‌రు షాక్ అవుతున్నారు.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్ పరాషర్ జోషిని చూసి చాలా మంది శ్రేయ‌స్ అయ్య‌ర్ అని అనుకున్నారు. శ్రేయ‌స్ పోలిక‌ల‌తో ప‌రాష‌ర్ ఉండ‌డంతో మ‌నోడు ఏంటి అంపైరింగ్ చేస్తున్నాడు అంటూ క‌న్ఫ్యూజ్ అయ్యార‌ట‌. గాయంతో ప్ర‌స్తుతం ఇంగ్లండ్ తో జ‌రుగుతున్న టెస్ట్ క్రికెట్‌కి కూడా శ్రేయ‌స్ దూరంగా ఉన్నారు. మ‌రి ఆన్ ఫీల్డ్‌లో అంపైరింగ్ చేయ‌డమేంట‌ని షాక్ అయ్యారు. త‌ర్వాత విష‌యం తెలుసుకొని ఒక్క‌సారి నవ్వుకున్నారు. పరాషర్ జోషీ తన కెరీర్‌లో 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లకు, 17 లిస్ట్ ఏ మ్యాచ్‌లకు, 14 టీ20లకు ఫీల్డ్ అంపైర్‌గా బాధ్యతల నిర్వర్తించాడు. ఓ లిస్ట్ ఏ మ్యాచ్‌కు టీవీ అంపైర్‌గా కూడా వ్యవహరించాడు.

ఇక ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్ జెయింట్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు కేవ‌లం 107 పరుగులే చేసింది. దయాలన్ హేమలత(25 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 31 నాటౌట్), హర్లీన్ డియోల్(31 బంతుల్లో 3 ఫోర్లతో 22) కాస్త రాణించ‌డంతో వంద పరుగుల మార్క్‌ని చేరుకున్నారు. అన‌వ‌స‌ర షాట్స్ ఆడి వికెట్స్ స‌మ‌ర్పించుకున్నారు కొంద‌రు బ్యాట్స్‌మెన్స్. ఆర్‌సీబీ బౌలర్లలో సోఫీ మోలినక్స్(3/25) మూడు వికెట్లు తీయగా.. రేణుక సింగ్(2/14) రెండు వికెట్లు పడగొట్టింది. జార్జియో వేర్‌హమ్‌కు ఓ వికెట్ దక్కింది.