రాజ్యసభకు సోనియా..! రాయ్‌బరేలి నుంచి ప్రియాంక పోటీ..!
సోనియా లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తనకు బదులుగా ప్రియాంక గాంధీని రాయ్‌బరేలి నుంచి బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. తనకు బదులుగా కూతురు ప్రియాంక గాంధీని రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని నిర్ణయించినట్లు సమాచారం. సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేట్ అవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక వేళ రాయ్‌బరేలి నుంచి ప్రియాంక పోటీ చేస్తే.. ఆమె ఎన్నికల్లో బరిలో దిగడం ఇదే ప్రథమం. 77 ఏండ్ల వయసున్న సోనియా గాంధీ గత కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు రాజస్థాన్ నుంచి ఆమె నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
రాయ్‌బరేలి నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియా గాంధీ.. 2006 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ ఆమె ఘన విజయం సాధించారు. సోనియా కుమారుడు రాహుల్ గాంధీ మాత్రం తన ఫ్యామిలీకి కంచుకోట అయిన అమేథిలో 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ అమేథీలో గెలుపొందారు.
ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని, ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొన్నేండ్ల నుంచి పార్టీ చెబుతూ వస్తుంది కానీ కార్యరూపం దాల్చలేదు. 2024 ఎన్నికల్లో మొత్తానికి ఆమె ఎన్నికల్లో పాల్గొనబోతోంది. రాయ్‌బరేలీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. 1950 నుంచి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పాగా వేస్తూనే ఉంది. ప్రియాంక తాత ఫీరోజ్ గాంధీ తొలిసారిగా ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 2019 ఎన్నికల్లోనే ప్రియాంక వారణాసి నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడ్డాయి. కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేసి గెలిస్తే.. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ జీవం పోసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram