భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదు రికార్డ్‌ల‌పై క‌న్నేసిన విరాట్‌..!

  • By: sn    breaking    Jan 21, 2024 11:49 PM IST
భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో ఐదు రికార్డ్‌ల‌పై క‌న్నేసిన విరాట్‌..!

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ జ‌న‌వ‌రి 25 నుండి ప్రారంభం కానున్న విష‌యం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. సొంత గ‌డ్డ‌పై ఇండియాని దెబ్బ కొట్టేందుకు ఇంగ్లాండ్ బాజ్ బాల్ వ్యూహం సిద్ధం చేస్తోంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇంగ్లిష్ టెస్టు జట్టు కోచింగ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంగ్లండ్ బాజ్ బాల్ వ్యూహంతో ముందుకు సాగుతుంది. అయితే “ఇంగ్లాండ్ బాజ్‌బాల్‌ను ఎదుర్కోవడానికి మాకు విరాట్‌బాల్ ఉందని” టీమిండియా దిగ్గ‌జ క్రికెట‌ర్ సునీల్ గవాస్కర్ కామెంట్స్ చేయ‌డం విశేషం. ఇక ఇదిలా ఉంటే జనవరి 25 నుండి 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుండ‌గా, ఇందులో భార‌త స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ స‌రికొత్త రికార్డులు సృష్టించ‌నున్నాడు.

టెస్టు క్రికెట్‌లో 9000 పరుగులు పూర్తి చేసేందుకు విరాట్ కోహ్లీకి ఇంకా 152 పరుగుల దూరంలో ఉన్నాడు. విరాట్‌కి ముందు స‌చిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు.ఇక బౌండ‌రీల విష‌యంలో కూడా విరాట్ కోహ్లీ మ‌రో రికార్డును న‌మోదు చేయ‌నున్నాడు. టెస్టు క్రికెట్‌లో 1000 బౌండరీలు పూర్తి చేయడానికి విరాట్ కోహ్లీ ఇంకా 9 బౌండరీల దూరంలో ఉన్నాడు. ఈ సిరీస్ లో మ‌రో 9 పరుగులు చేస్తే విరాట్ కోహ్లీ ఇంగ్లాండు పై 2000 వేల ప‌రుగులు పూర్తి చేసిన ప్లేయ‌ర్ ఘ‌న‌త సాధించ‌డంతో పాటు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ ల స‌ర‌స‌న నిలుస్తాడు. మ‌రోవైపు ఇంగ్లాండ్ పై మ‌రో 52 ప‌రుగులు చేస్తే ఇంగ్లాండ్ పై జ‌ట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.

ఇక ఈ టోర్నీలో మ‌రో మూడు సెంచ‌రీలు సాధిస్తే.. ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించ‌నున్నాడు. స‌చిన్ టెండూల్కర్, గవాస్కర్ చెరో 7 సెంచరీలు చేయగా, కోహ్లీ ఖాతాలో 5 సెంచరీలు ఉన్నాయి. టెస్టు క్రికెట్ లో కోహ్లీ 29 సెంచరీలు, 30 అర్ధసెంచరీలు సాధించాడనీ, రాబోయే ఐదు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ లో కోహ్లీ నిలకడ, కన్వర్షన్ రేట్ నిర్ణయాత్మకంగా ఉంటుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.