ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయి.. అధిష్ఠానం ఎంపిక

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి ఎవరన్న సస్పెన్స్‌కు బీజేపీ అధిష్ఠానం తెర దించింది. గిరిజనుడైన విష్షుదేవ్‌సాయిని సీఎం పోస్టుకు ఎంపిక చేసింది.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా విష్ణుదేవ్‌ సాయి.. అధిష్ఠానం ఎంపిక

మాజీ సీఎం రమణ్‌సింగ్‌కు దక్కని చాన్స్‌

మోదీ గ్యారెంటీలు అమలు చేస్తానన్న కొత్త సీఎం

ఛత్తీస్‌గఢ్‌ కొత్త సీఎంగా విష్ణుదేవ్‌ సాయిని బీజేపీ అధిష్ఠానం ఎంపిక చేసింది. దీంతో గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. బీజేపీ తరఫున ఎన్నికైన 54 మంది ఎమ్మెల్యేలు ఆదివారం రాయపూర్‌లో సమావేశమైన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఛత్తీస్‌గఢ్‌కు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. మంత్రులతోపాటు ఉప ముఖ్యమంత్రిని కూడా ప్రకటించనున్నట్టు సమావేశానికి ముందు బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ తెలిపారు.


ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రకటించకుండానే ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసింది. మొత్తం 90 సీట్లకుగాను 54 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. డిసెంబర్‌ 3వ తేదీన ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ తన పదవికి రాజీనామా చేశారు. కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన విష్ణుదేవ్‌సాయికి భగేల్‌ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. ‘ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రిగా ఛత్తీస్‌గఢ్‌ న్యాయ, ప్రగతి ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తున్నాను’ అని ఎక్స్‌లో భగేల్‌ పేర్కొన్నారు.


కుంకురి స్థానం నుంచి విష్ణుదేవ్‌ 87వేల పైచిలుకు ఓట్లు సాధించారు. ఒక గిరిజనుడిని ముఖ్యమంత్రిని చేసే పక్షంలో విష్ణుదేవ్‌ ఆ పదవికి ఎంపిక కావచ్చే అభిప్రాయాలు ముందు నుంచీ ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడైన విష్ణుదేవ్‌.. గతంలో మోదీ తొలి మంత్రివర్గంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో రాయగఢ్‌ లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2020 నుంచి 2022 వరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన గ్యారెంటీల అమలుపై తాను దృష్టి కేంద్రీకరిస్తానని విష్ణుదేవ్‌ చెప్పారు.