CM Revanth Reddy: నా వద్ధ ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తా: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: నా వద్ధ ఉన్న శాఖలనే కొత్త మంత్రులకు ఇస్తా: సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణలో కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తన వద్ధ ఉన్న కీలక శాఖలనే కొత్త మంత్రులకు కేటాయిస్తానని..ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లగానే వారికి శాఖలు కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పని భారం ఉందని మంత్రులు ఎవరైనా చెప్తే ఆ శాఖలను కూడా కేటాయిస్తానని చెప్పారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి వద్ధ ఉన్న..హోంశాఖ, మున్సిపల్, క్రీడలు, విద్యతో పాటు కీలకమైన 11 శాఖల నుంచే కొత్త మంత్రులకు శాఖలను కేటాయించనున్నట్లుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ప్రకటనతో పాత మంత్రుల శాఖలో మార్పులు లేనట్లేనని తేలిపోయింది. తన ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి బుధవారం న్యూఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటకలలో విజయవంతమైన కులగణన ప్రక్రియను పార్టీ నాయకత్వంతో పంచుకునేందుకు అధిష్టానంతో పిలుపుతోనే తాను ఢిల్లీకి రావడం జరిగిందన్నారు. నేను అధికారంలో ఉన్నంతవరకు కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలోకి నో ఎంట్రీ అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్లు చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులే తెలంగాణకు శత్రువులన్నారు. తెలంగాణ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అని..కిషన్ రెడ్డి..కేసీఆర్ ఇద్దరు ఒక్కటేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదన్నారు. తెలంగాణ అభివృద్ధికి కిషన్ రెడ్డి ముందుకు వస్తే వారితో కలిసి వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డితో సమీక్ష చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కులగణనలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కిషన్ రెడ్డి అందరి నివాసాలకు ప్రత్యేకంగా వెళ్లి వివరాలు స్వీకరించాలని హైదరాబాద్ కలెక్టర్ కు ప్రత్యేకంగా సూచించానన్నారు. అయితే ఆ నలుగురు సర్వేలో వివరాలు పంచుకోలేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏ రోజైనా తెలంగాణ ప్రాజెక్టులపై కిషన్ రెడ్డి నివేదిక ఇచ్చారా అని.. కనీసం తెలంగాణకు ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

కేంద్ర క్యాబినెట్లో తెలంగాణ అంశాలను ఎప్పుడైనా కిషన్ రెడ్డి ప్రస్తావించారా అని నిలదీశారు. నిర్మల సీతారామన్ చెన్నైకు మెట్రో తీసుకువెళ్ళిందని..ప్రహ్లాద్ కర్ణాటకకు మెట్రో తీసుకెళ్లారని..తెలంగాణ నుంచి కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏమి తీసుకురాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి కిషన్ రెడ్డి అడ్డుగా ఉన్నారన్నారు.
తెలంగాణ మంత్రివర్గం విస్తరణలో సామాజిక న్యాయం పాటించామని..నక్సలిజంకు అంతం ఉండదని..సామాజిక అసమానతలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు.