Telangana Liquor Shop Tenders| మద్యం దుకాణాల టెండర్స్ కు తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్

విధాత, హైదరాబాద్ : 2025..2027 రెండు సంవత్స రాల(Liquor Policy 2025..27)కు గాను మద్యం దుకాణాల కేటాయింపు టెండర్ (Liquor Shop Tenders) ప్రక్రియ నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 డిసెంబర్ 1నుంచి 2027నవంబర్ 20వరకు కు దుకాణాల కేటాయింపు చేయనున్నట్లుగా నోటిఫికేషన్ లో వెల్లడించారు. దరఖాస్తు ఫీజును రూ.3లక్షలుగా నిర్ణయించారు. దుకాణాల కేటాయింపులో గౌడ్ లకు 15శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
2011జనాభా లెక్కలను అనుసరించి 5వేల జనాభా గ్రామాలకు రూ.50లక్షల లైసెన్స్ ఫీజు నిర్ణయించారు. 5000నుంచి 50వేల జనాభాకు రూ.55లక్షలు, 50వేల నుంచి 1లక్ష జనాభాకు 60లక్షలు, 1లక్ష నుంచి 5లక్షల వరకు జనాభాకు రూ.65లక్షల, 5లక్షల నుంచి 20లక్షల జనాభాకు రూ.85లక్షలు, 20లక్షల పై చిలుకు జనాభా ప్రాంతంలోని దుకాణానికి రూ.1కోటి 10లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ఆరు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 వద్ద కొనసాగుతున్న రిటైల్ అవుట్‌లెట్‌ల సంఖ్యను అలాగే కొనసాగించనున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగానే కొత్త మద్యం దుకాణాలకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం విశేషం. దుకాణాలను లాటరీ పద్దతిలోనే కొనసాగిస్తారు. ప్రస్తుతం 2023-25 దుకాణాల లైసెన్స్ గడువు ఈ ఏడాది నవంబరు 30తో ముగియనుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ4 వైన్ షాపులు 2,620 వరకు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే 690 మద్యం దుకాణాలున్నాయి. కేవలం మద్యం దుకాణాల దరఖాస్తుల విక్రయం ద్వారానే రూ.3,500 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఉన్న రూ.2లక్షల దరఖాస్తు ఫీజును రూ.3లక్షలకు పెంచారు. కొత్త మద్యం పాలసీ అమలు చేస్తే.. కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వానికి లైసెన్స్ ఫీజుల ద్వారా 30 వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.