Bajaj Allianz Life | బజాజ్ అలయన్జ్ బొనాంజా: పాలసీదారులకు రూ.1,833 కోట్ల పండుగ

  • By: TAAZ |    business |    Published on : May 16, 2025 8:46 PM IST
Bajaj Allianz Life | బజాజ్ అలయన్జ్ బొనాంజా: పాలసీదారులకు రూ.1,833 కోట్ల పండుగ

Bajaj Allianz Life | బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ తమ పాలసీదారులకు భారీ శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 1,833 కోట్ల బోనస్‌ను ప్రకటించింది. ఇది కంపెనీ చరిత్రలోనే అధికం. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఇచ్చిన రూ. 1,383 కోట్లతో పోలిస్తే ఈసారి బోనస్ 32 శాతం పెరిగింది. ఈ బోనస్‌తో సుమారు 11.71 లక్షల మంది పాలసీదారులు లబ్ధి పొందుతారు. బజాజ్ అలయన్జ్ లైఫ్ గత 24 సంవత్సరాలుగా ప్రతి ఏటా బోనస్ ప్రకటిస్తూ తమ కస్టమర్లకు అదనపు ప్రయోజనాలు అందిస్తున్నది. ఈసారి ప్రకటించిన బోనస్ 2025 మార్చి 31 నాటికి అమల్లో ఉన్న పాలసీలన్నింటికీ వర్తిస్తుంది. కంపెనీ తమ లాభాల నుంచి ఈ మొత్తాన్ని పంచుతోంది.

బజాజ్ అలయన్జ్ లైఫ్ ఏస్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఏస్ అడ్వాంటేజ్, బజాజ్ అలయన్జ్ లైఫ్ ఎలీట్ అష్యూర్ వంటి పాలసీలు కంపెనీ అందిస్తోంది. ఈ సందర్భంగా బజాజ్ అలయన్జ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో తరుణ్ చుగ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది రికార్డు స్థాయిలో రూ. 1,833 కోట్ల బోనస్ ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ తెలివైన పెట్టుబడి విధానాలు, బలమైన ఆర్థిక స్థితే దీనికి కారణమన్నారు. తమ సంస్థకు కస్లమర్లే ముఖ్యమని భావిస్తామని, వారి జీవిత లక్ష్యాలు నెరవేరడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రకటించే ఈ బోనస్‌లు పాలసీ మెచ్యూర్ అయినప్పుడు లేదా పాలసీ నుంచి వైదొలిగినప్పుడు పాలసీదారులకు అందిస్తారు. కొన్ని పాలసీల్లో అయితే ప్రతి సంవత్సరం లేదా పాలసీ నిబంధనల ప్రకారం నగదు రూపంలో కూడా ఇస్తారు.