Boeing CEO | ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రూ.25 కోట్లు వదులుకున్న బోయింగ్‌ సీఈవో..!

Boeing CEO | ప్రమాదానికి బాధ్యత వహిస్తూ రూ.25 కోట్లు వదులుకున్న బోయింగ్‌ సీఈవో..!

Boeing CEO : ఈరోజుల్లో సంపద కోసం ఎంతటి తప్పుడు పనులైనా చేస్తున్నారు. ఆస్తుల కోసం అయినవాళ్లనే చంపుకుంటున్నారు. ఇలాంటి మనుషులున్న రోజుల్లో ప్రముఖ విమానయాన సంస్థ బోయింగ్‌ సీఈవో డేవిడ్‌ కలౌన్‌ తన ధర్మ గుణాన్ని చాటుకున్నారు. తన హయాంలో సంస్థకు చెందిన విమానంలో జరిగిన ప్రమాదానికి బాధ్యత వహిస్తూ ఏకంగా రూ.25 కోట్ల బోనస్‌ను వదులుకున్నారు.

బోయింగ్‌ సీఈవో డేవిడ్‌ కలౌన్‌ గత ఏడాది (2023లో) 33 మిలియన్‌ డాలర్ల వేతనం అందుకున్నారు. అయితే మరో 3 మి. డాలర్ల (సుమారు రూ.25 కోట్లు) మేర అతను బోనస్‌గా అందుకోవాల్సి ఉంది. కానీ అలస్కా ఎయిర్‌లైన్స్‌ వినియోగించిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానం తలుపు గాల్లో ఉండగానే ఊడిన ఘటనకు బాధ్యత వహిస్తూ 2023 బోనస్‌ రూ.25 కోట్లను వదులుకున్నారు.

ప్రమాదానికి బాధ్యత వహిస్తూ తమ సీఈవో డేవిడ్‌ కలౌన్‌ బోనస్‌ను వదులుకున్నాఆడని బోయింగ్‌ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలావుంటే బోయింగ్ కంపెనీ తయారీల్లో నాణ్యత, భద్రతపై పలు దర్యాప్తులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దర్యాప్తులకు సహకరించేందుకు ఈ ఏడాది ఆఖరులో తాను పదవి నుంచి వైదొలగనున్నట్లు డేవిడ్‌ ఈ నెలలోనే ప్రకటించారు.

కాగా డేవిడ్‌ కలౌన్‌ 2023 ఏడాదికి 1.4 మిలియన్‌ డాలర్ల జీతం, 30.2 మిలియన్‌ డాలర్ల షేర్లు పొందారు. అంటే మొత్తం 32.8 మిలియన్‌ డాలర్లు అందుకున్నారు. 2022లో తీసుకున్న 22.6 మిలియన్‌ డాలర్లతో పోల్చుకుంటే ఇది చాలా అధికం. కానీ ఈ ఏడాది జనవరి 5న అలస్కా విమానం డోర్‌ గాల్లో ఊడినప్పటి నుంచి బోయింగ్‌ షేరు పడిపోతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఆయన వేతనం చాలా తగ్గే అవకాశం ఉంది.