Health Insurance Vs Restoration Policy : సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి, రీస్టోరేషన్ పాలసీకి తేడా ఏంటి?
రీస్టోరేషన్ పాలసీతో మీరు క్లైమ్ చేసిన తర్వాత కూడా మొత్తం ఇన్సూరెన్స్ తిరిగి పొందవచ్చు అత్యవసర పరిస్థితులలో ప్రయోజనం.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్య ఖర్చులు సామాన్యులు భరించే పరిస్థితి లేదు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలపై ఇటీవల కాలంలో అవేర్ నెస్ పెరిగింది. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ లో రీస్టోరేషన్ పాలసీలు కూడా అమల్లోకి వచ్చాయి. అసలు రీస్టోరేషన్ పాలసీల వల్ల ఉపయోగం ఏంటి? సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియానికి, రీస్టోరేషన్ పాలసీకి ఎక్కువ ప్రీమియం చెల్లించాలా? అసలు ఈ పాలసీతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
రీస్టోరేషన్ పాలసీ అంటే ఏంటి?
సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి, రీస్టోరేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి తేడా ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ. 5 లక్షల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఏడాదిలో రూ. 5 లక్షల విలువైన వైద్య ఖర్చులను ఈ పాలసీ ద్వారా క్లైయిమ్ చేసుకోవచ్చు. రీస్టోరేషన్ పాలసీ ద్వారా అయితే మీరు తీసుకున్న పాలసీ మొత్తం క్లైయిమ్ చేసుకున్న తర్వాత కూడా మళ్లీ అంతే మొత్తంలో కూడా ఈ పాలసీ ద్వారా క్లైయిమ్ చేసుకొనే వెసులుబాటు ఉంది. అంటే మీరు ప్రతి ఏటా రూ. 10 లక్షల విలువైన రీస్టోరేషన్ హెల్త్ పాలసీ తీసుకున్నారనుకుందాం. అయితే ఏడాది పూర్తి కాకముందే రూ. 10 లక్షలను ఆసుపత్రుల్లో ఖర్చుల కింద క్లైయిమ్ చేశారనుకుందాం. మళ్లీ మీ కుటుంబంలో వైద్య అవసరాల కోసం మరో రూ. 10 లక్షలను కూడా ఈ పాలసీ కింద క్లైయిమ్ చేసుకోవచ్చు. దీన్ని రీఫిల్ బెనిఫిట్ అంటారు. బీమా క్లైయిమ్ చేసుకున్న తర్వాత తిరిగి అంతే మొత్తాన్ని రీస్టోర్ లేదా రీచార్జ్ చేసేందుకు అనుమతిస్తుంది. అందుకే ఈ పాలసీని రీస్టోరేషన్ పాలసీ అని పిలుస్తారు. అయితే సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీతో పోలిస్తే రీస్టోరేషన్ పాలసీ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
రీస్టోరేషన్ పాలసీతో ప్రయోజనాలు తెలుసా?
అత్యంత అత్యవసర పరిస్థితుల్లో ఈ పాలసీతో ప్రయోజనాలు కలుగుతాయి. కుటుంబంలో వేర్వేరు సభ్యులకు ఒకే ఏడాదిలో అనారోగ్య సమస్యలు ఏర్పడితే ఈ పాలసీ ద్వారా చికిత్స తీసుకోవచ్చు.
ఈ పాలసీని తీసుకొనే సమయంలో నామమాత్రపు అదనపు ఖర్చుతో కూడా తీసుకోవచ్చు.
పూర్తి ఇన్సూరెన్స్ లేదా పాక్షిక ఇన్సూరెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఈ పాలసీ పునరుద్ధరణ జరుగుతుంది
పాలసీ వ్యవధిలోపు ఒకే క్లయిమ్ లో మీరు పూర్తి చేసిన ఇన్సూరెన్స్ మొత్తాన్ని రెస్టోరేషన్ బెనిఫిట్ మీకు తిరిగి అందిస్తుంది
ఉదహరణకు మీరు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే… ఇందులో మీరు రూ. 6 లక్షలు క్లైయిమ్ చేశారనుకుందాం… వెంటనే మీ పాలసీ రూ. 10 లక్షల విలువకు చేరుతుంది. అంటే మీరు ఆ ఏడాదిలో మరో రూ. 10 లక్షలు అధిక ఇన్సూరెన్స్ విలువ ఉన్న పాలసీ కొనుగోలు చేయడం కంటే రీస్టోరేషన్ ప్రయోజనం ఉన్న పాలసీని కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
కుటుంబం మొత్తానికి వర్తిస్తోందా?
ఈ పాలసీల్లో కూడా రెండు రకాలుంటాయి. ఒకటి వ్యక్తిగతమైంది. రెండోది కుటుంబానికి సంబంధించి. మీరు పాలసీ కొనుగోలు చేసే సమయంలో వ్యక్తిగత పాలసీ తీసుకుంటే అది మీకు ఒక్కరికే ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులందరికి కలిపి పాలసీ తీసుకుంటే అది కుటుంబానికి మొత్తం ఉపయోగపడుతుంది. పాలసీ రకాల ఆధారంగా తదుపరి ఆసుపత్రిలో చేరినప్పుడు ఒకే రకమైన అనారోగ్యానికి ఇప్పటికే క్లెయిమ్‌లు తీసుకొన్నా కూడా అదే అనారోగ్యం లేదా వ్యాధికి కూడా ఈ పాలసీ కింద క్లైయిమ్ ను పొందే అవకాశం ఉంది. అయితే ఈ పాలసీల్లో రకాలున్నాయి. మీరు సెలెక్ట్ చేసిన పాలసీ, ప్రీమియం ఆధారంగా వంద శాతం క్లైయిమ్ ఏడాదిలో ఎన్నిసార్లు ఉపయోగించుకోవచ్చో ముందే తెలుస్తోంది. కొన్ని పాలసీల్లో ఒక్కసారి, మరికొన్నింటిలో రెండు నుంచి మూడు సార్లు, ఇంకొన్ని పాలసీల్లో అపరిమితంగా ఉపయోగించుకొనే వెసులుబాటు ఉంది. అయితే ఆయా సంస్థలు, పాలసీల ఆధారంగా ఇవి మారుతూ ఉంటాయి. పాలసీని ఎంపిక చేసుకొనే సమయంలోనే ఈ వివరాలను తెలుసుకోవాలి. ఉదహరణకు రమేశ్ అనే వ్యక్తి తన కుటుంబానికి మొత్తానికి రూ. 5 లక్షల పాలసీ తీసుకున్నాడనుకుందాం. ఏదో ఒక ప్రమాదంలో రమేశ్ తో పాటు ఆయన కుటుంబంలోని మరో ఇద్దరు గాయపడితే ఈ ముగ్గురికి ఈ పాలసీని ఉపయోగించుకోవచ్చు. అంటే ఒక్కో సభ్యుడికి రూ. 5 లక్షల చొప్పున క్లైయిమ్ చేసుకొనే అవకాశం ఉంది. అంటే రూ. 15 లక్షలు క్లైయిమ్ చేసుకోవచ్చు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram