DoT | సైబర్ మోసాలు.. 28వేల మొబైల్స్ బ్లాక్ చేయాలని టెలికాం కంపెనీలకు డాట్ ఆదేశం..
DoT | దేశంలో సైబర్ నేరాలతో పాటు ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టెలికం వనరులతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు డాట్ (Department of Telecommunications) రంగంలోకి దిగింది. డిజిటల్ మోసాల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది.

DoT | దేశంలో సైబర్ నేరాలతో పాటు ఆర్థిక మోసాలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో టెలికం వనరులతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు డాట్ (Department of Telecommunications) రంగంలోకి దిగింది. డిజిటల్ మోసాల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు 20లక్షల మొబైల్ కనెక్షన్స్‌ని రీ వేరిఫై చేయాలని చెప్పింది. దీనికి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, రాష్ట్ర పోలీసులు డాట్‌కు అందించనున్నారు.
కేంద్ర హోంశాఖ, రాష్ట్ర పోలీసుల విశ్లేషణ ప్రకారం.. 28,200 మొబైల్ ఫోన్స్ వివిధ సైబర్ క్రైమ్‌లో దుర్వినియోగమైనట్లు పేర్కొన్నాయి. ఆయా హ్యాండ్‌సెట్లతో 20లక్షలకుపైగా మొబైల్ నంబర్లను వినియోగించారు. ఈ క్రమంలో 28,200 మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ చేయాలని, ఈ హ్యాండ్‌సెట్‌లకు అనుసంధానించిన 20 లక్షల మొబైల్ కనెక్షన్‌లను తిరిగి నిర్ధారించుకోవాలని టెలికాం కంపెనీలకు డాట్ స్పష్టం చేసింది. రీ-వెరిఫికేషన్‌లో విఫలమైన కనెక్షన్లను తొలగించాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా.. సైబర్ నేరగాళ్లు వివిధ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.
అయితే, ఫోన్ల నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్రం ‘చక్షు’ వెబ్‌పోర్టల్‌ని ప్రారంభించింది. మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలను ఈ పోర్టల్‌లో నమోదు చేస్తే దర్యాప్తు సంస్థలు వారి పనిపట్టనున్నాయి. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతుంటారు. సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా చర్యలు తీసుకుంటారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు అవకాశం ఉంటుంది.