పశ్చిమాసియా యుద్ద పరిస్థితులు అంతర్జాతీయంగా ఇంధనం, బంగారం, వెండి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇటు భారత ప్రభుత్వం బంగారంపై దిగుమతుల సుంకాలను 6శాతం నుంచి 15 శాతం పెంచడంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగిపోయాయి. బుధవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల ధర రూ. 13,910 పెరిగి రూ,1,67,890కి చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.12,750 పెరిగి రూ. 1,53,900 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.100పెరిగి రూ. 3,00,100 వద్ద కొనసాగుతుంది.
బంగారంపై సుంకాల పెంపు…ధరలు మరింత పైకి..
పశ్చిమాసియా యుద్దంతో దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించేందుకు ప్రజలు ఇంధన పొదుపు పాటించాలని, ఏడాది పాటు బంగారం కొనుగోలు నిలిపివేయాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలును నియంత్రించేందుకు కేంద్రం బంగారం దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 6 శాతంగా ఉన్న ఈ సుంకాన్ని ఏకంగా 15 శాతానికి పెంచింది. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడం, పెరుగుతున్న వాణిజ్య లోటును నియంత్రించడం ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి మరియు రూపాయి బలోపేతానికి ఎంతో దోహదపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానం
ప్రపంచంలో బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది. గత కొన్నేళ్లుగా దేశంలోకి బంగారం దిగుమతులు అసాధారణంగా పెరిగాయి. గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ గణాంకాల ప్రకారం, 2022లో 36.5 బిలియన్ డాలర్లుగా ఉన్న బంగారం దిగుమతులు, 2025 నాటికి 58.9 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ భారీ పెరుగుదల భారత రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది. ఇటీవల ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీలలో ఒకటిగా రూపాయి నిలవడానికి ఈ మితిమీరిన దిగుమతులు కూడా ఒక కారణమని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశీ మారక నిల్వల పరిరక్షణకు బంగారంపై దిగుమతుల సుంకాలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
దిగుమతుల ఖర్చుల అడ్డుకట్టతోనే ఆర్థిక భద్రత
కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సైతం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా విదేశీ మారక నిల్వలను పొదుపు చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. విలాసాల కోసం చేసే దిగుమతి ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా దేశ ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
డబ్బులు పుట్టడం కష్టమే…
ప్రముఖ బ్యాంకర్, కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ సైతం రాబోయే రోజుల్లో దేశంలో ప్రజలకు నగదు పుట్టకపోవచ్చంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ (CII) వార్షిక వ్యాపార సదస్సులో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో రాబోయే ఆర్థిక సవాళ్లపై భారత పరిశ్రమ రంగాన్ని హెచ్చరించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని, తద్వారా ఎదురయ్యే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవడానికి భారతదేశం ముందస్తుగా సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
చమురు ధరలు పెరిగితే సామాన్యులపై ఆర్థిక భారం
గత రెండు నెలలుగా ఇంధన ధరలపై యుద్ధ ప్రభావం అంతగా కనిపించనప్పటికీ, ఇకపై ఆ పరిస్థితి ఉండబోదని కోటక్ అభిప్రాయపడ్డారు. పెరిగిన చమురు ధరల ప్రభావం వినియోగదారులపై పడటం ప్రారంభమవుతుందని, ఇది రవాణా, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న భారతీయ కుటుంబాలు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడతాయని ఉదయ్ కోటక్ హెచ్చరించారు. దేశం ఆ పరిస్థితులకు దగ్గరగా ఉందని..అలాంటి పరిస్థితును ఎదుర్కొనేందుకు ముందే సన్నద్ధం కావాలిఅని ఆయన స్పష్టం చేశారు.
చైనా తరహా విధానం మేలు
ఇంధన భద్రత విషయంలో భారత్ వేగంగా అడుగులు వేయాలని, ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ విషయంలో చైనాను ఉదాహరణగా చూపిస్తూ, అక్కడ 60 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌గా మారాయని, మనం కూడా అంతటి వేగంతో లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కేవలం సొంత కంపెనీల లాభాలు లేదా లాబీయింగ్ గురించి ఆలోచించకుండా, దేశ ప్రయోజనాల కోసం ఆలోచించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి :
ఢిల్లీ గర్ల్స్ హాస్టల్‌లో షాకింగ్ ఘటన.. భారీగా కండోమ్స్ !
Chicken Price | కొండెక్కిన కోడి కూర ధర.. కిలో రూ. 350 పైనే..!
