అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో బంగారం ధరలు విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియాలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ మేఘాలు బులియన్ మార్కెట్ మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి.. గత మూడు రోజుల నుండి బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. అయితే ఈ తగ్గుదల తాత్కాలికమేనని బులియన్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధరలు మరోసారి తగ్గుదల నమోదు చేశాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,800తగ్గి రూ. 1,40,130వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,650 తగ్గి రూ. 1,28,450వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 100తగ్గి రూ. 2,44,900వద్ద నిలిచింది.
కొనుగోలుకు సానుకూలం
ప్రస్తుతం బంగారం ధరలు అంతర్జాతీయంగా ఎనిమిది నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. మరికొన్ని రోజులు హెచ్చతగ్గుల మధ్య పసిడి ధరలు ఉగిసలాట ఖాయం అని..అందుకే శుభాకార్యాల కోసం బంగారం అవసరమైన వారికి కొనుగోలుకు ప్రస్తుత ధరలు సానుకూలంగా చెప్పవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఉద్రిక్తత పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లు, డాలర్ విలువ, ద్రవ్యోల్భణంలో మార్పులతో బంగారం ధరలు మరింత హెచ్చతగ్గులకు గురికావచ్చని అంచనా వేస్తున్నారు.
