పశ్చిమాసియా సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్ లో పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పసిడి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. తాజా పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్‌లో సోమవారం కూడా పసిడి ధరలు క్షీణించగా.. వెండి ధరలు పెరిగాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.710 తగ్గి, రూ.1,56,220కు పడిపోయింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 650 తగ్గి రూ. 143,200వద్ద నిలిచింది. కిలో వెండి ధర మాత్రం పుంజుకుని రూ.10,000 పెరిగి రూ. 3,00,000లకు చేరింది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, యూఎస్ ట్రెజరీ బాండ్ యీల్డ్స్ పెరగడం, అమెరికన్ డాలర్ బలపడటం వంటి కీలక అంశాలు బంగారం, వెండి ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో ఈ విలువైన లోహాల ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. బలమైన డాలర్, ఇతర స్థూల ఆర్థిక సూచికల కారణంగా గత వారం స్పాట్ గోల్డ్ 4% నష్టపోయింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మరింత పెంచుతోంది. ఇది కఠిన ద్రవ్య విధానాలు, వడ్డీ రేట్ల పెంపునకు దారితీసే అవకాశముంది. ఒకవేళ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచితే, డాలర్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. అప్పుడు బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ తగ్గుతుందని నిపుణుల అంచనా.
ట్రేడింగ్ ఎకనామిక్స్ ప్రకారం, అమెరికాలో ద్రవ్యోల్బణం ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు కావడంతో, ఈ ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం లేదని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. పైగా, సంవత్సరం చివరిలోగా వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిణామాల వల్ల యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది. భారత్‌లో, ఈ వారం ప్రభుత్వం ప్రకటించిన తాజా దిగుమతి ఆంక్షల ప్రభావం వెండి ధరలపై పడవచ్చు అని అంచనా వేస్తున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం నిలిచిపోవడంతో ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయి. యూఎస్ డబ్ల్యూటీఐ (WTI) క్రూడ్ ఆయిల్ 2.5% పెరిగి బ్యారెల్‌కు దాదాపు 108 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, బ్రెంట్ క్రూడ్ 2% ఎగబాకి 111 డాలర్ల పైకి చేరింది.
ఇవి కూడా చదవండి :
కేరళం సీఎంగా వీ.డీ. సతీశన్ ప్రమాణస్వీకారం
Sree Leela | శ్రీలీల–తిలక్ వర్మ రిలేషన్ వార్తలకు ఫుల్‌స్టాప్.. “అవి కేవలం పుకార్లు మాత్రమే” అంటూ తల్లి క్లారిటీ
