విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల క్రమంలో బంగారం, వెండి ధరలు మరోసారి దిగివచ్చాయి. వారం రోజుల వరుస పెరుగుదల అనంతరం బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేయగా..వెండి సైతం అదే దారిలో సాగింది. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ 710 తగ్గి రూ.1,52,890 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,40,150 పలుకుతోంది. కిలో వెండి ధర సైతం రూ.5,000 తగ్గి రూ.2,55,000 వద్ద కొనసాగుతుంది.
పసిడి మళ్లీ పైపైకి...
ద్రవ్యోల్బణంలో పెద్దగా ఊహించని మార్పులు లేకపోవడం, అమెరికా ఫెడరల్ సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించే విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబించవచ్చనే అంచనాల మధ్య పసిడి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. అయితే అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరపై ప్రభావం చూపుతున్నాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మార్కెట్ అంచనా వేసిన ప్రకారం రావడంతో.. పసిడి ధరలు పుంజుకోనున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
అలాగే యూఎస్ ఫెడ్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచదన్న అభిప్రాయం పసిడికి ఊతమిస్తుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో, డాలర్ బలహీన పడినప్పుడు బంగారానికి డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత్ లో పెళ్లీళ్ల సీజన్ కావడంతో ఇంకా పసిడి ధర పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
