క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి 10 సూత్రాలు
హౌజింగ్ , కారు, ఎడ్యుకేషన్ లోన్ ఇలా ఏదైనా అవసరం కోసం లోన్ తీసుకోవాలంటే మొట్ట మొదటగా మీ క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిశీలిస్తాయి. మీ ఆర్ధిక లావాదేవీలు, ఆర్ధికంగా మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రెడిట్ స్కోర్ ద్వారా తెలుసుకోవచ్చు

విధాత: హౌజింగ్ , కారు, ఎడ్యుకేషన్ లోన్ ఇలా ఏదైనా అవసరం కోసం లోన్ తీసుకోవాలంటే మొట్ట మొదటగా మీ క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిశీలిస్తాయి. మీ ఆర్ధిక లావాదేవీలు, ఆర్ధికంగా మీరు ఎంత క్రమశిక్షణగా ఉన్నారో క్రెడిట్ స్కోర్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ఆధారంగా మీకు బ్యాంకులు ఇచ్చే రుణాల్లో వడ్డీ రేటు కూడా తగ్గించే అవకాశం ఉంది. అందుకే క్రెడిట్ స్కోర్ పై ప్రభావం పడకుండా ఆర్ధిక క్రమశిక్షణను పాటించాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తారు.
క్రెడిట్ స్కోర్ అంటే ఏంటి?
ఒక వ్యక్తి ఆర్ధికంగా ఎంత క్రమశిక్షణగా ఉన్నాడో తెలిపేదే క్రెడిట్ స్కోర్. అంటే మీరు ఏదైనా బ్యాంకు నుంచి పర్సనల్ లోన్ , హౌజింగ్, కారు లోన్ వంటి లోన్లలో ఏదైనా తీసుకుంటే దాన్ని సకాలంలో చెల్లిస్తున్నారో లేదో క్రెడిట్ స్కోర్ ద్వారా తెలిసిపోతోంది. అప్పులు తిరిగి చెల్లించడంలో ఎంత మేరకు క్రమశిక్షణగా ఉన్నారో తెలుస్తుంది. క్రెడిట్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే రుణాలు అంత త్వరగా వస్తాయి. క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే వడ్డీ రేటును కూడా తగ్గిస్తాయి. వివిధ బ్యాంకులు, సంస్థల నుంచి ఒక్క వ్యక్తి తీసుకున్న అప్పులు, చెల్లింపులను బ్యాంకులు క్రెడిట్ స్కోరును నిర్ధారించే సంస్థలకు పంపుతాయి.
క్రెడిట్ స్కోర్ ఎంత ఉండాలి?
క్రెడిట్ స్కోర్ ను 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 కంటే ఎక్కువ స్కోర్ ఉంటే మంచి క్రెడిట్ స్కోర్ ఉన్నట్టుగా పరిగణిస్తారు. లోన్లు ఇచ్చే ముందు మీ క్రెడిట్ స్కోర్ ను బ్యాంకులు పరిశీలిస్తాయి. క్రెడిట్ స్కోర్ 750 కి పైగా ఉంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతాయి. తక్కువ వడ్డీతో పాటు లోన్ ప్రక్రియను వీలైనంత త్వరగా కంప్లీట్ చేస్తాయి. ఒకవేళ క్రెడిట్ స్కోర్ 750 కంటే తక్కువగా ఉంటే లోన్ కు అవసరమైన ప్రతి డాక్యుమెంట్ ను అడుగుతారు.
క్రెడిట్ స్కోర్ పెరగాలంటే ఏం చేయాలి?
క్రెడిట్ స్కోర్ పెరగాలంటే 10 పాయింట్లను జాగ్రత్తగా పాటించాలి.
1.తీసుకున్న అప్పులను సకాలంలో చెల్లించాలి. దీని వల్ల క్రెడిట్ స్కోర్ పెరిగేందుకు దోహదపడుతుంది.
2.ఎవరికైనా జామీను లేదా పూచీకత్తు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో చెల్లించకపోయినా.. లేదా అతను డిఫాల్టర్ అయితే అది జామీనుగా ఉన్న వ్యక్తి క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావం చూపుతుంది. జామీను లేదా పూచీకత్తుకు దూరంగా ఉంటేనే మంచిది.
3. రుణం తీసుకొనే వ్యక్తి మీకు బాగా తెలిసిన వ్యక్తి అయితే లేదా ఆర్ధిక ఇబ్బందులు లేవని తెలుసుకున్న తర్వాతే ఈ విషయంలో ముందుకువెళ్లాలని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు.
4. ప్రతి నెల మాదిరిగానే ఖర్చు చేస్తూ అధిక క్రెడిట్ కార్డు పరిమితిని పొందడం ద్వారా మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని తగ్గించుకోవచ్చు.
5. క్రెడిట్ కార్డు లిమిట్ లో 30 శాతం మాత్రమే వినియోగించాలి. అంతకంటే ఎక్కువ వినియోగిస్తే అది క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది.
6. బకాయిలను సకాలంలో చెల్లించాలి. క్రెడిట్ కార్డు బిల్లులు, లేదా ఈఎంఐ వాయిదాల చెల్లింపుల్లో ఆలస్యమైతే క్రెడిట్ స్కోర్ కు నష్టం జరుగుతుంది.
7. క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలి. మీకు తెలియకుండా అనధికార లావాదేవీలు జరిగితే అది పరోక్షంగా మనకు నష్టం జరుగుతుంది. ఈ అనధికార లావాదేవీలను పే చేయకపోవడంతో క్రెడిట్ స్కోరు దెబ్బతింటుంది.
8. అవసరం ఉన్నా లేకున్నా కొత్త క్రెడిట్ కార్డుల కోసం ధరఖాస్తులు చేయవద్దు. కొత్తగా క్రెడిట్ కార్డు కోసం ధరఖాస్తు చేస్తే అది మీ క్రెడిట్ స్కోరుపై ప్రభావం చూపుతుంది.
9.ఏ రకమైన అప్పులనైనా సకాలంలో చెల్లిస్తేనే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.
10. రుణాల చెల్లింపునకు కాల వ్యవధిని ఎక్కువ తీసుకోవాలి.
ఏదేని కారణంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటే దాన్ని మెరుగుపర్చుకోవాలంటే నాలుగు నుంచి 12 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. సకాలంలో రుణాల చెల్లింపుతో పాటు క్రెడిట్ కార్డుల వినియోగం ఇతరత్రా అంశాల ఆధారంగా ఇది ఆధారపడుతుంది.