IPO: ఎక్వస్ లిమిటెడ్ ఐపీవో పత్రాల దాఖలు.. రూ.1700 కోట్లు సమీకరణ లక్ష్యం

  • By: sr    business    Jun 05, 2025 10:21 PM IST
IPO: ఎక్వస్ లిమిటెడ్ ఐపీవో పత్రాల దాఖలు.. రూ.1700 కోట్లు సమీకరణ లక్ష్యం

ముంబయి: ఏరోస్పేస్, కన్స్యూమర్ రంగాలకు ప్రిసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ సేవలు అందించే ఎక్వస్ లిమిటెడ్ తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం కాన్ఫిడెన్షియల్ ప్రాతిపదికన ముసాయిదా పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ మేరకు 2025 జూన్ 3న బహిరంగ ప్రకటన జారీ అయింది.

వర్గాల సమాచారం ప్రకారం, ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 200 మిలియన్ డాలర్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూ తాజాగా షేర్ల జారీతో పాటు, ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉంటుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లు తెలుపుతున్నాయి. దీనిపై కంపెనీ స్పందించడానికి నిరాకరించింది.

ఎక్వస్ డైరెక్టర్ల బోర్డు ఇటీవల కంపెనీని పబ్లిక్ కంపెనీగా మార్చడానికి, అలాగే “ఎక్వస్ ప్రైవేట్ లిమిటెడ్” నుండి “ఎక్వస్ లిమిటెడ్”గా పేరును మార్చడానికి ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

కోటక్ మహీంద్రా క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ ఈ IPOకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

పెట్టుబడులు, ఆర్థిక పనితీరు:

కార్యకలాపాల విస్తరణ కోసం ప్రమోటర్లు, ఎమికస్ క్యాపిటల్, అమాన్సా క్యాపిటల్ స్టెడ్‌వ్యూ క్యాపిటల్, కాటమారన్ (ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి ఫ్యామిలీ ఆఫీస్), స్పార్టా గ్రూప్, దేశ్ దేశ్‌పాండే ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీస్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎక్వస్‌లో గణనీయంగా పెట్టుబడులు పెట్టారు. పీఈ ఇన్వెస్టర్ల నుండి CCPS రూపంలో సుమారు రూ. 586 కోట్లు సమీకరించింది. ఈ నిధులను కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించనున్నారు.

2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 988 కోట్లు, నిర్వహణ ఆదాయం రూ. 970 కోట్లుగా నమోదైంది. కేర్ఎడ్జ్ రేటింగ్స్ అంచనా ప్రకారం, కేపెక్స్ ప్రాజెక్టులు పూర్తయ్యాక, ఏరోస్పేస్ విభాగంలో ఆర్డర్ల ప్రవాహం దన్నుతో కంపెనీ ఆదాయం మధ్యకాలికంగా వార్షిక ప్రాతిపదికన 45 శాతం మేర వృద్ధి చెందుతుంది.

నాయకత్వం, కార్యకలాపాలు:

అరవింద్ మెలిగెరి ఎక్వస్ వ్యవస్థాపక చైర్మన్‌గా ఉన్నారు. ఆయనకు ఏరోస్పేస్ విభాగంలో దశాబ్దాల అనుభవం ఉంది. కంపెనీ ఇటీవల జీన్-మిచెల్ కొండామిన్‌ను తమ ఏరోస్పేస్ విభాగానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. రాజీవ్ కౌల్ మేనేజింగ్ డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. ఎక్వస్ భారత్, ఫ్రాన్స్, అమెరికాలో తయారీ కార్యకలాపాలను కలిగి ఉంది. కర్ణాటకలో (బెల్గావి, హుబ్బళ్లి, కొప్పల్) మూడు తయారీ క్లస్టర్లు ఉన్నాయి. మీడియా కథనాల ప్రకారం, ఎక్వస్ టాటా ఎలక్ట్రానిక్స్, మదర్సన్ గ్రూప్, జాబిల్తో పాటు యాపిల్ ఉత్పత్తుల కోసం మెకానికల్ విడిభాగాలను కూడా తయారు చేస్తోంది