Property Documents In Hundi| కూతుర్లపై కోపంతో హుండీలో రూ.4కోట్ల ఆస్తి పత్రాలు!

విధాత: కుమార్తెలపై కోపంతో ఓ తండ్రి తన రూ.4కోట్ల విలువైన ఆస్తిని ఆలయానికి విరాళంగా అందిస్తూ ఆస్తి పత్రాలను హుండీలో వేసిన ఘటన వైరల్ గా మారింది. ఈ వివాదం ఇప్పుడు తమిళనాడులో హాట్‌టాపిక్‌గా నడుస్తుంది. తమిళనాడు-తిరువణ్ణామలై జిల్లా అరణి సమీపంలోని కోనైయూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ విజయన్ భార్య కస్తూరి, ఇద్దరు కుమార్తెలతో కలిసి పడవేడు సమీపంలోని కలికాపురంలో నివాసం ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం తండ్రి విజయన్‌కి, కుమార్తెలకు మధ్య ఆస్తి పంపకాల విషయంలో వివాదం తలెత్తింది. భార్య, కూతుళ్లకూ దూరంగా ఉంటున్నాడు. తాను కష్టపడి సంపాదించిన ఆస్తుల విషయంలో తన భార్య, కుమార్తెలు తనను బెదిరింపులకు గురి చేయడం నచ్చని విజయన్ ఆస్తిని అంతా ఆలయానికి విరాళంగా ఇవ్వాలనుకున్నాడు. రూ.4 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లు, పొలాలకు సంబంధించిన ఆస్తి పత్రాలను పాతవేడు గ్రామంలోని ప్రసిద్ధ శ్రీరేణుకాంబాల్ అమ్మవారి ఆలయ హుండీలో వేశాడు.
అయితే ఈ విషయం తెలుసుకున్న భార్య, కుమార్తెలు విజయన్ చేసిన పనితో లబోదిబోమన్నారు. వెంటనే విజయన్ కుమార్తెలు ఆలయ అధికారులను సంప్రదించి తమ తండ్రి హుండీలో వేసిన ఆస్తి పత్రాలను తిరిగి ఇచ్చేయాలంటూ అభ్యర్థించారు. అయితే విరాళంగా వచ్చిన ఆస్తులను తిరిగి ఇవ్వడం కుదరదని, నిబంధనల ప్రకారం జాయింట్ కమిషనర్ కార్యాలయంలో పత్రాలను అప్పగిస్తామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ వివాదంపై జేసీ న్యాయస్థానం ఏం తేల్చనుందోనని తమిళనాడు వాసులు ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు. మంచిగా కొంత తక్కువో ఎక్కువో తండ్రి మాట విని ఇచ్చిన ఆస్తి తీసుకుంటే సరిపోయేదని ఇప్పుడేం చేయాలంటూ కుమార్తెలు వాపోతున్నారు.