Silver Price | 10 నెలల్లోనే రెండింతలైన కిలో వెండి ధర: ఇన్వెస్టర్లకు లాభాల పంట
గత 10 నెలల్లోనే కిలో వెండి ధర ₹89,300 నుంచి ₹2,06,000లకు చేరి రెండింతలైంది. పండుగ డిమాండ్ సోలార్/ఏఐ/ఈవీలలో పారిశ్రామిక వినియోగం పెరుగుదల సరఫరా కొరత దీనికి ప్రధాన కారణాలు. స్వల్పకాలిక నష్టాల దృష్ట్యా, నిపుణులు ప్రస్తుతం కొనుగోళ్లు మానుకోవాలని సూచిస్తున్నారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 16 (విధాత ప్రతినిధి): పది నెలల కాలంలోనే వెండి ధర కిలో కు డబులైంది. 10 నెలల క్రితం కిలో వెండి ధర రూ. 89,300 వేలు. ఇప్పుడు సిల్వర్ ధర రూ. 2,06,000లక్షలకు చేరింది. అతి తక్కువ కాలంలో ఇంత ధర పెరగడం ఇదే తొలిసారి. బంగారంతో పోలిస్తే 37 శాతం ఎక్కువ రాబడిని ఇచ్చింది. బంగారంతో పాటే వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.
వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
పండుగ సీజన్‌లో బంగారం, వెండి ధరలు పోటీపడి పెరిగిపోతున్నాయి. ప్రపంచంలో వెండి వినియోగదారుల్లో ఇండియా టాప్ లో ఉంటుంది. దీపావళి సమయంలో బంగారం లేదా వెండి కొనుగోలును శుభప్రదంగా భావిస్తారు. ఇది కూడా వెండి ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. మరోవైపు పారిశ్రామిక అవసరాల్లో కూడా వెండి వినియోగం పెరిగింది. సోలార్, ఏఐ, ఎలక్ట్రిక్ వాహనాల్లో వెండి వినియోగం ఎక్కువైంది. వెండి సరఫరాలో కొరత ఏర్పడింది. డిమాండ్ పెరుగుతున్నప్పటికి సరఫరాలో అడ్డంకులున్నాయి. పర్యావరణ నిబంధనలు, మైనింగ్ మూసివేతతో వెండికి డిమాండ్ మరింత పెరిగింది. రాగి, జింక్ వంటి లోహాల మైనింగ్ సమయంలో దాదాపు 70 శాతం వెండిని ఉప ఉత్పత్తిగా వినియోగిస్తారు. రాగి తవ్వకం పెరిగితేనే వెండి సరఫరా కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. డిమాండ్, సరఫరా మధ్య అంతరంతో వెండికి ధర పెరుగుతోంది. మరో వైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలతో ప్రపంచంలోని మార్కెట్లు నష్టాల బాటపడుతున్నాయి. ఈ తరుణంలో సురక్షితమైన పెట్టుబడుల కోసం బంగారం, వెండి వైపు చూస్తున్నారు. చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు పెరుగుతున్నందున వెండికి డిమాండ్ బాగా పెరిగింది. లండన్ మార్కెట్లో వెండి కొరత కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగా చెబుతున్నారు.
వెండిపై ఇప్పుడు పెట్టుబడులు పెట్టవచ్చా?
గత ఏడాది అంటే 2024 డిసెంబర్ 31 న కిలో వెండి ధర రూ. 89,300 ఉండింది. ఈ ఏడాది అంటే 2025 అక్టోబర్ 15 నాటికి అది రూ. 1,79,000లకు చేరింది. అక్టోబర్ 16న చెన్నైలో వెండి ధర కిలోకు రూ.2,06,000లకు చేరింది. వెండిపై పెట్టుబడి పెట్టిన వారికి 99.55 శాతం రిటర్న్స్ వచ్చాయి.
వెండి ధరలు దూకుడుగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో కొనుగోలు చేయడం మానుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా షట్ డౌన్, సుంకాలు, ఫెడ్ రేట్ కోతల కారణంగా పెట్టుబడిదారులు వెండిని కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. స్వల్పకాలిక నష్టాలను పరిగణనలోకి తీసుకొని కొత్తగా కొనుగోళ్లు చేయవద్దని సూచిస్తున్నారు. వెండిపై పెట్టుబడి పెట్టినవారికి వంద శాతం లాభాలు వచ్చాయి. ఈ సమయంలో దూకుడుగా వెండిపై పెట్టుబడులు సరైందికాదని చెబుతున్నారు. బంగారంతో పోలిస్తే వెండి వేగంగా పెరుగుతోంది.
వెండి ఎంత పెరిగే అవకాశం ఉంది?
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఔన్సు వెండి ధర 35 డాలర్లు దాటింది. ఆ తర్వాత సెప్టెంబర్ 14 నాటికి గరిష్టస్తాయి 44.11 డాలర్లకు చేరింది. ఇక అక్టోబర్ లో 51.30 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివరి నాటికి వెండి ఔన్స్ ధరలు 50 నుంచి 55 డాలర్లకు పెరిగే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. ఇక 2026 నాటికి వెండి ధరలు ఔన్స్ కు 75 డాలర్లను దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.