Triumph 350 CC Engine | ఇంజిన్ కెపాసిటీ తగ్గింది.. ధర మాత్రం పెద్దగా తగ్గలేదు.. నిరాశపరిచిన ట్రయంఫ్ నిర్ణయం!

Triumph 350 CC Engine | ట్రయంఫ్ మోటార్‌సైకిల్ (Triumph Motorcycles) మార్కెట్‌లోకి కొత్తగా 350 సీసీ బైక్‌లను తీసుకొచ్చింది. ఇప్పటికేమార్కెట్‌లో ఉన్న Triumph Speed 400, Triumph Speed T4 బైక్‌ల ఇంజిన్‌లను 400సీసీ నుంచి 350 సీసీకి అప్‌డేట్ చేసి కొత్త బైక్‌లను విడుదల చేసింది.

Triumph 350 CC Engine | ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్ (Triumph Motorcycles) మార్కెట్‌లోకి కొత్తగా 350 సీసీ బైక్‌లను తీసుకొచ్చింది. ఇప్పటికేమార్కెట్‌లో ఉన్న Triumph Speed 400, Triumph Speed T4 బైక్‌ల ఇంజిన్‌లను 400సీసీ నుంచి 350 సీసీకి అప్‌డేట్ చేసి కొత్త బైక్‌లను విడుదల చేసింది. జీఎస్టీ మార్పుతో వచ్చిన పన్ను ప్రయోజనాలను పొందడమే లక్ష్యంగా ట్రయంఫ్ 350సీసీ బైక్‌లను రూపొందించింది.

ఈ రెండు బైక్‌లలో ప్రధానంగా ఇంజిన్ మార్పు మాత్రమే జరిగింది. Speed 400లో 350సీసీ లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 8000 ఆర్‌పీఎం వద్ద 36.4bhp పవర్, 7000 ఆర్‌పీఎం వద్ద 32 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత 400సీసీ ఇంజిన్ మోడల్‌తో పోలిస్తే 3bhp, 5.5nm తగ్గింది. అదే Speed T4లో 350 సీసీ ఇంజిన్ 7500 ఆర్‌పీఎం వద్ద 28.6bhp, 5500 ఆర్‌పీఎం వద్ద 31nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌తో పోలిస్తే ఇందులో కూడా స్వల్పంగా పవర్, టార్క్ తగ్గింది.

ఇంజిన్‌లోనే మార్పు.. ఫీచర్స్ అన్నీ సేమ్!

ఇంజిన్ మార్పులు తప్ప ఈ మోడల్‌లో మిగతా అంశాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. డిజైన్, ఫీచర్లు, బాడీ స్ట్రక్చర్ అన్నీ పాత మోడళ్ల మాదిరిగానే కొనసాగాయి. ఆసక్తికరంగా ఇంజిన్ సామర్థ్యం తగ్గించినప్పటికీ బైక్‌పై 400 బ్యాడ్జింగ్‌ను అలాగే ఉంచింది. సస్పెన్షన్ విషయానికి వస్తే స్పీడ్ 400లో ఇన్వర్టెడ్ ఫోర్క్, మోనోషాక్ సెటప్ కొనసాగించారు. స్పీడ్ టీ4లో టెలిస్కోపిక్ ఫోర్క్‌ను అందించారు. రెండు మోడళ్లలోనూ 17 అంగుళాల అలాయ్ వీల్స్ ఉపయోగించారు. ముందు 300మి.మీ., వెనుక 230 మి.మీ. డిస్క్ బ్రేకులు, డ్యూయల్ ఛానల్ ABS సిస్టమ్ ఉంది.

ధరలో నిరాశే!

ఇలా మొత్తంగా చూస్తే ట్రయంఫ్ తన బైక్‌లను 350 సీసీ సెగ్మెంట్‌లోకి తీసుకురావడం ద్వారా పన్ను ప్రయోజనాలను పొందాలని చేస్తోంది. అయితే ఇంజిన్ పవర్‌ తగ్గినా ధరలో మాత్రం పెద్ద మార్పు లేకపోవడం ఇప్పుడు చర్చకు దారితీసింది. కొత్త ధరల ప్రకారం Speed 400 ధర రూ.2.32 లక్షలు (ఎక్స్ షోరూం) ఉండగా, ఇది గతంతో పోలిస్తే రూ.7,110 మాత్రమే తగ్గింది. ఇక స్పీడ్ T4 ధర రూ.1.95లక్షలు (ఎక్స్ షోరూం)గానే కొనసాగుతోంది.

ధర తగ్గకపోవడానికి కారణమిదే!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ మార్పుల కారణంగా 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం గల బైక్‌ల ధరలు భారీగా పెరిగాయి. 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ ఉన్న బైక్‌లపై సుమారు 40 శాతం వరకు పన్ను ఉండగా.. 350 సీసీ లోపు బైక్‌లకు కేవలం 18 శాతం మాత్రమే పన్ను ఉంది. దీంతో పెద్ద ఇంజిన్ బైక్‌ల ధరలు పెరిగి, వినియోగదారులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ట్రయంఫ్ తన 400 సీసీ శ్రేణిలో ఉన్న పలు మోడళ్లను 350 సీసీ లోకి మార్చింది. కానీ ధరను మాత్రం పెద్దగా తగ్గించలేదు. దీనికి గతంలో తీసుకున్న నిర్ణయమే కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

గత ఏడాది సెప్టెంబర్‌లో జీఎస్టీ సవరణల తర్వాత ట్రయంఫ్ తన 400 సీసీ బైక్‌ల ధరలను పెంచకుండా అదే స్థాయిలో ఉంచింది. అప్పట్లో ఇతర బ్రాండ్లతో పోటీ అధికంగా ఉండటంతో, ధరలను పెంచకుండా అలాగే కొనసాగించింది. పెరిగిన పన్నును కంపెనీనే స్వయంగా భరించింది. అయితే ఆ నష్టాన్ని ఇప్పుడు భర్తీ చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. అందుకే ఇంజిన్ సామర్థ్యాన్ని తగ్గించినప్పటికీ.. ధరలో మాత్రం పెద్దగా మార్పు తీసుకురాలేదు. దీనిపై నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ధర తగ్గుతుందని ఆశించాం.. కానీ ఇంజిన్ సామర్థ్యం మాత్రమే తగ్గించారని సెటైర్లు వేస్తున్నారు. ఇంజిన్ సామర్థ్యం తగ్గినప్పటికీ ధరలో పెద్దగా మార్పులేకపోవడంతో వినియోగదారులు 400సీసీ బైక్‌లకే మొగ్గు చూపే అవకాశం ఉందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More:

Bajaj Auto | 400CC బైక్‌లకు గుడ్‌బై.. 350 సీసీ ఇంజిన్‌తో బజాజ్ కొత్త స్ట్రాటజీ!

Suzuki Burgman Street | 1.02లక్షల్లో 2026 బర్గ్‌మ్యాన్ స్ట్రీట్.. కొత్త ఫీచర్లతో లాంచ్!

Latest News