Vehicle Insurance | వాహనాల ఇన్సూరెన్స్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

మోటర్‌ వాహనాలు.. అంటే మీరు వాడే కారు, బైక్ వంటి వాహనాల ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్సూరెన్స్ విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలో ఏ అంశాలను పరిశీలించాలి? ఏ అంశాలు ఇన్సూరెన్స్ ప్రీమియంపై ప్రభావం చూపుతాయి? పుల్ ఇన్సూరెన్స్ అవసరమా? థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అవసరమా ? నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దామా?

  • By: TAAZ |    business |    Published on : Oct 28, 2025 4:43 PM IST
Vehicle Insurance | వాహనాల ఇన్సూరెన్స్.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Vehicle Insurance | భారత దేశంలో మోటర్ వాహనాల చట్టం – 1988 ప్రకారం వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వాహనాలకు కనీసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయినా ఉండాలనేది ఈ చట్టం ఉద్దేశం. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఇన్సూరెన్స్‌తో ఆర్ధిక భద్రత లభిస్తుంది. అంతేకాదు ప్రమాదం వల్ల వాహనం దెబ్బతింటే రిపేర్లకు అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. వాహనాలు దొంగతనానికి గురైనా, ప్రకృతి వైపరీత్యాలతో వాహనం దెబ్బతిన్నా, లేక వాహనం పనికిరాకుండా పోయినా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అందుకే వాహనాలకు ఇన్సూరెన్స్ తప్పనిసరి.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

వాహనాలకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనేముందు కొన్ని విషయాలను పరిశీలించాలి. మీరు కొనుగోలు చేసిన వాహనం, మోడల్, ఇంజిన్ సామర్థ్యం అంటే సీసీ. వాహనం తయారైన సంవత్సరం వంటి అంశాలు వాహనాల ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని నిర్ణయిస్తాయి. జీరో డిప్రిసియేషన్ కవర్ గురించి పాలసీ తీసుకొనే సమయంలో తెలుసుకోవాలి. వాహనంలో విడి భాగాలు కొంత కాలానికి తమ విలువను కోల్పోతాయి. వాహనానికి ఏదైనా రిపేర్ వచ్చిన సమయంలో ఏదైనా విడిభాగం మార్చాల్సి వస్తే ఇన్సూరెన్స్ కవర్ కాదు. అప్పుడు జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెట్టాలి. జీరో డిప్రిసియేషన్ కవర్ ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీయే ఆ విడిభాగం మార్చితే డబ్బులు సమకూర్చుతుంది. ఈ విషయాన్ని పాలసీ తీసుకొనే సమయంలో తెలుసుకోవాలి. వివిధ బీమా కంపెనీలు అందిస్తున్న కవరేజీ, ప్రీమియం పోల్చుకోవాలి. ఏ కంపెనీ ఇన్సూరెన్స్ మీకు ప్రయోజనంగా ఉంటుందో ఆలోచించి ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలి.

అదనపు కవరేజీల గురించి..

ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలో మరికొన్ని అంశాలను గుర్తుంచుకోవాలి. వాహనం దొంగతనానికి గురైనా, లేదా ప్రమాదంలో పూర్తిగా దెబ్బతిని మరమ్మత్తుకు కూడా పనికిరాకుండా ఉంటే కొత్త వాహనం కొనుగోలుకు ఇన్సూరెన్స్ కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఇన్సూరెన్స్ పాలసీతో పాటు యాడ్ ఆన్ కవరేజీల గురించి తెలుసుకోవాలి. రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే మీరు ప్రయాణం చేస్తున్న సమయంలో వాహనం ఆగిపోయి స్టార్ట్ కాకుండా ఉంటే సర్వీసింగ్ సెంటర్ వరకు మీ వాహనాన్ని తీసుకెళ్లే ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తోంది. కొన్ని సమయాల్లో మెకానిక్ ను మీ వద్దకే పంపి వాహనం రిపేర్ చేయిస్తోంది. ఇంజిన్ ప్రొటెక్ట్ కవరేజీ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి అదనపు కవరేజీకి ఇన్సూరెన్స్ ప్రీమియం కొంచెం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలో మీరు తీసుకొనే పాలసీలో ఉన్న రక్షణ అంశాలు ఏంటి? ఇన్సూరెన్స్ కవరేజీ లేనివి ఏంటివి? అనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే అవసరం ఉన్నా లేకున్నా అదనపు కవరేజీలు తీసుకోవద్దు. లాంగ్ డ్రైవింగ్ చేసేవారు తమ వాహనాలకు ఇంజిన్ ప్రొటెక్షన్ కవరేజీ తీసుకోవాలి. తక్కువ దూరం ప్రయాణించేవారికి అవసరం లేదు. ఇలా మీకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు అవసరమో చూసుకోవాలి.

ప్రతి చిన్న దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవద్దు

ప్రతి చిన్న అవసరాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయవద్దు. అలా చేస్తే మీకు లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. కొన్ని కంపెనీలు ఇన్సూరెన్స్ ను ఏడాదిలో ఒక్కసారి కూడా క్లెయిమ్ చేసుకోకపోతే నో క్లెయిమ్ బోనస్ అంటే ఎన్సీ బీని అందిస్తాయి. ఇలా ఎన్ని సంవత్సరాలు ఎన్ సీ బీ పొందితే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా తగ్గుతుంది. అంటే ఈ ఏడాది మీరు ఒక్కసారి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే వచ్చే ఏడాది ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గుతుంది. ఎన్ సీ బీ గరిష్ఠంగా 50 శాతం కూడా పొందే అవకాశం ఉంది. అయితే ఇన్సూరెన్స్ పాలసీ కొనుగోలు చేసే సమయంలో ఈ విషయాలను తెలుసుకోవాలి. మరో వైపు వాహనాలు కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల ప్రమాదాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.

ఐడీవీ కీలకం

ఏదైనా వాహనానికి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొనే సమయంలో ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ (ఐవీడీ) అనేది కీలకం. అంటే మీ వాహనానికి ప్రస్తుత మార్కెట్ విలువే ఐవీడీ. ఒకవేళ మీ వాహనం పూర్తిగా దెబ్బతింటే ఇన్సూరెన్స్ కంపెనీ మీకు చెల్లించే మొత్తం కూడా ఐడీవీ ఆధారంగానే ఉంటుంది. ఐడీవీ ఎక్కువగా ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా ఎక్కువే. వాహనం దొంగతనానికి గురైనప్పుడో, ప్రకృతి వైపరీత్యాల్లో వాహనం చెడిపోతే మీ వాహనం ఐడీవీ ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే మీరు పాలసీ తీసుకొనే సమయంలో మీ వాహనం ఐడీవీ ఉదాహరణకు రూ. 5 లక్షలు అయితే…. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసే సమయంలో కూడా ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 5 లక్షలు చెల్లిస్తుంది.
(ఈ వివరాలు మీ ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలు, పాలసీల కోసం ధృవీకృత వాహన బీమా సంస్థలను సంప్రదించాలి)

ఇవి కూడా చదవండి..

Bank | బ్యాంకుల్లో క్లైయిమ్ చేయని నగదును ఎలా తీసుకోవాలి?
Aadhaar Services | ‘ఆధార్’ అప్‌డేట్ చేయాలా?.. ఇక ఆధార్ సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం లేదు!
Tax Benifits On Joint Home Loan : భార్య పేరున పెట్టుబడులు: ట్యాక్స్ నుంచి మినహాయింపులు