ChatGPT Go Free | చాట్‌జీపీటీ భారతీయ యూజర్లకు ఓపెన్‌ఏఐ బంపర్ ఆఫర్
చాట్‌జీపీటీ గో వెర్షన్ భారతీయ యూజర్లకు ఏడాదిపాటు ఉచితంగా లభించనున్నది. దీనికి చేయాల్సింది ఏంటి? ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది.. ఆ వివరాలు మీ కోసం..
ChatGPT Go Free | ప్రముఖ ఏఐ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ తన భారతీయ యూజర్లకు అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. చాట్‌జీపీటీ గో (ChatGPT Go)ను ఏడాదిపాటు ఉచితంగా వాడుకునే అవకాశం కల్పించనున్నది. ఇది లిమిటెడ్ టైమ్ ప్రమోషన్ పీరియడ్‌గా ఓపెన్‌ఏఐ తెలిపింది. దానికి సైన్ అప్ ఆప్షన్ నవంబర్ 4 నుంచి ప్రారంభం కానుంది. ChatGPT Goను భారతదేశంలో 2025 ఆగస్ట్‌లో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. చాట్‌జీపీటీ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న వెర్షన్‌ను అందుబాటు ధరలలో అందించాలన్న యూజర్ల ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓపెన్‌ఏఐ వెల్లడించింది.
మెసేజ్‌లు, ఇమేజ్ తయారీ, ఫైల్ అప్‌లోడ్స్ విషయంలో పరిమితిని పెంచుతూ ChatGPT Goను ఇటీవల ప్రారంభించారు. ఇది సబ్‌స్క్రిప్షన్ ఆధారితం. దీనికి నెలకు 399 రూపాయలు చార్జ్ చేస్తున్నారు.
బెంగళూరులో నవంబర్ 4వ తేదీన ఓపెన్‌ఏఐ డెవ్‌డే ఎక్సేంజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ఈ ఈవెంట్ నిర్వహించడం ఇదే మొదటిసారి. నవంబర్ 4 నుంచి ప్రారంభమయ్యే లిమిటెడ్ టైమ్ ప్రమోషనల్ పీరియడ్‌లో సైన్ అప్ చేసే అందరు భారతీయ యూజర్లకు ఏడాదిపాటు ChatGPT Go ఉచితంగా లభిస్తుందని ఓపెన్‌ఏఐ కంపెనీ తెలిపింది. తాజా వెర్షన్‌ను లాంచ్ చేసిన తర్వాత చాట్‌జీపీటీ పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ దాదాపు రెట్టింపు అయ్యారు. భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో చాట్‌జీపీటీ గో ను ప్రపంచవ్యాప్తంగా 90 మార్కెట్లలోకి ఓపెన్‌ఏఐ విడుదల చేసింది. భారతదేశంలో ప్రతి రోజూ లక్షల మంది చాట్‌జీపీటీని వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి డెవపర్లు, విద్యార్థులు, వృత్తి నిపుణులు ఓపెన్‌ఏఐ అడ్వాన్స్‌డ్ టూల్స్‌పై ఆధారపడుతున్నారు. ఈ ప్రమోషన్.. ‘ఇండియాఫస్ట్’ అనే ఓపెన్‌ఏఐ కమిట్‌మెంట్‌కు, IndiaAI మిషన్‌కు మద్దతుకు ఇది కొనసాగింపు అని ఓపెన్‌ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్తవారే అర్హులా?
‘ఇప్పటికే ChatGPT Go సబ్‌స్క్రైబర్లు ఈ 12 నెలల ఉచిత ప్రమోషన్‌కు అర్హులు. కొద్ది నెల క్రితం మేం భారత్‌లో ChatGPT Goను ప్రారంభించాం. దానికి యూజర్ల మద్దతు, వారి సృజనాత్మకత మాకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి’ అని ఓపెన్‌ఏఐ వైస్ ప్రసిడెంట్, చాట్‌జీపీటీ హెడ్ నిక్ టర్లీ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘భారతదేశంలో మా మొదటి డెవ్‌డే ఎక్సేంజ్ ఈవెంట్ సందర్భంగా ChatGPT Go ను ఏడాదిపాటు అందరికీ ఉచితంగా ఇవ్వాలని భావించాం. ఇది అడ్వాన్స్‌డ్ ఏఐని ఉపయోగించుకునేందుకు మరింత ముందికి అవకాశం కల్పిస్తుంది’ అని ఆయన పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram