Guide For Vehicle Insurances | వాహనాల ఇన్సూరెన్స్: ఈ జాగ్రత్తల గురించి తెలుసా?

వాహనాల ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవలసిన జాగ్రత్తలు, థర్డ్ పార్టీ, పూర్తి కవరేజీ పాలసీల వివరాలు.

Guide For Vehicle Insurances | వాహనాల ఇన్సూరెన్స్: ఈ జాగ్రత్తల గురించి తెలుసా?

మీ కారు లేదా వాహనాల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? పూర్తిగా కవరయ్యే పాలసీ తీసుకోవాలా? ఏ పాలసీతో ఎంత ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకోవచ్చు? ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఇన్సూరెన్స్ వర్తిస్తోందా? తక్కువ ప్రీమియం ఉన్న పాలసీలు తీసుకోవాలా… ఎక్కువ ప్రీమియం ఉన్న పాలసీలు తీసుకోవాలా? భీమా రంగ నిపుణులు సూచనల గురించి ఒక్కసారి తెలుసుకుందాం.

కారు ఇన్సూరెన్స్ పాలసీ విషయంలో జాగ్రత్తలు

కారు లేదా వాహనాల ఇన్సూరెన్స్ పాలసీ సమయంలో కొన్నిఅంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీ రకాలను గురించి తెలుసుకోవాలి. యాడ్ ఆన్ కవరేజీ, మీరు తీసుకునే పాలసీకి ఉన్న షరతులు, నిబంధనల గురించి భీమా ఏజంటు లేదా భీమా కంపెనీ నుంచి తెలుసుకోవాలి. ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు, ఇతర సమయాల్లో మీ వాహనం రిపేర్ కు గురైతే ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకోవచ్చో లేదో చెక్ చేయాలి. మీరు తీసుకునే పాలసీతో ఎంత మేరకు కవరేజీ వస్తోందో పరిశీలించాలి. ప్రీమియం తక్కువగా ఉంటే ఏ మేరకు కవరేజీ లభిస్తుంది, పూర్తి కవరేజీకి ప్రీమియం ఎంత అనే వివరాలు పరిశీలించాలి. వాహనం తీసుకొని నాలుగైదు సంవత్సరాలు కాగానే పూర్తి కవరేజీ పాలసీ కాకుండా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని భీమా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో కూడా పాలసీలు తీసుకోవచ్చు. అయితే ఆన్ లైన్ లో భీమా చేసే సమయంలో ఫేక్ సంస్థలు, మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్

ప్రతి వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి.మీరు నడిపే వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టిన సమయంలో జరిగిన ప్రమాదంలో మరో వ్యక్తి లేదా, వాహనం దెబ్బతింటే ఈ ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకోవచ్చు. కానీ, ప్రమాదానికి కారణమైన వాహనానికి మాత్రం ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోలేం. ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కు, పూర్తి కవరేజీ చేసే ఇన్సూరెన్స్ పాలసీకి మధ్య ప్రీమియం తేడా ఎంతో చెక్ చేసుకోవాలి. పూర్తి కవరేజీ పాలసీ తీసుకోవాలని భీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు.

పూర్తి కవరేజీ పాలసీ

థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తో ప్రమాదానికి కారణమైన వాహనానికి ఎలాంటి ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకోలేం. కానీ, పూర్తి కవరేజీ పాలసీతో ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకోవచ్చు. ప్రమాదం చేసిన వాహనానికి కూడా ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా, వాహనం దొంగతనానికి గురైనప్పుడు, ప్రమాదాల్లో వాహనం పూర్తిగా దెబ్బతింటే పూర్తి కవరేజీ పాలసీ ద్వారా ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసుకోవచ్చు. వాహనం దొంగతనం జరిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఇన్సూరెన్స్ కంపెనీకి అందించాలి. వాహనానికి ప్రమాదం జరిగితే ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజంట్ కు సమాచారం ఇవ్వాలి. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, ఇతర ప్రమాదాలకు సంబంధించిన సమాచారం కూడా ఇన్సూరెన్స్ కంపెనీకి సమాచారం ఇవ్వాలి. కంపెనీ అడిగిన డాక్యుమెంట్స్ అందించాలి.

ఇన్సూరెన్స్ ఎప్పుడు వర్తించదు?

ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా డామేజ్ అయినా చోరికి గురైనా థర్డ్ పార్టీ భీమా ద్వారా పరిహారం లభించదు.
వాహనాన్ని వ్యక్తిగత అవసరాల కోసం అని చెప్పి కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగిస్తే ఇన్సూరెన్స్ వర్తించదు.. పాలసీ జియోగ్రాఫికల్ పరిధిఎంత వరకూ ఉంది అనేది తెలుసుకోవాలి.. ఎందుకంటే ఆ పరిధికి మించి వేరే ప్రాంతాల్లో ఎక్కడైనా కారు ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ రాదు. మద్యం, మాదక ద్రవ్యాలు సేవించి వాహనం నడిపినప్పుడు కూడా పాలసీ చెల్లదు.

డిక్లేర్డ్ వాల్యూ గురించి తెలుసుకోవాలి

వాహనాలకు బీమా చేసే సమయంలో పాలసీకి చెల్లించే ప్రీమియంతో పాటు మీరు భీమా విలువ మధ్య వ్యత్యాసాన్ని అర్ధం చేసుకోవాలి. మీ వాహనం దొంగతనం జరిగిన సమయంలో ఏదైనా ప్రమాదంలో రిపేర్ చేసే పరిస్థితి లేకుండా దెబ్బతిన్నా పొందే గరిష్ట విలువనే డిక్లేర్డ్ వ్యాల్యూ అని పిలుస్తారు.ఎక్కువ భీమా డిక్లేర్డ్ వాల్యూ ఉంటే పాలసీ ప్రీమియం కూడా పెరిగే అవకాశాలుంటాయి. అయితే ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేసే సమయంలో మనం మొత్తం ఇన్సూరెన్స్ ను క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాహనం చోరికి గురైతే తగినంత పరిహారం అందేలా డిక్లేర్డ్ వాల్యూను ఎంచుకోవాలి.

నో క్లైయిమ్ బోనస్ గురించి తెలుసుకోవాలి

పాలసీ వ్యవధిలో ఎటువంటి క్లెయిమ్‌లు చేయకపోతే బీమా కంపెనీ నో క్లెయిమ్ బోనస్ (NCB) మంజూరు చేస్తుంది. ఇన్సూరెన్స్ చేసిన ఏడాది తర్వాత ఎలాంటి క్లైయిమ్ చేయకపోతే రెండో ఏడాది పాలసీలో 20 శాతం తగ్గింపు లభిస్తుంది. ఇలా ప్రతి ఏటా క్లైయిమ్ చేయకుండా ఉంటే ఈ డిస్కౌంట్ పెరుగుతూనే ఉంటుంది. ఐదేళ్ల తర్వాత ఇది 50 శాతానికి చేరుకుంటుంది. ప్రతి చిన్న రిపేర్ కు ఇన్సూరెన్స్ క్లైయిమ్ చేయవద్దని భీమా రంగ నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ రెన్యూవల్ ను మర్చిపోవద్దు.మీ పాలసీ 90 రోజులు దాటితే నో క్లైయిమ్ బోనస్ వంటి ప్రయోజనాలను కూడా కోల్పోతారు.